హరికృష్ణతో విభేదాలపై బాబు క్లారిటీ: షర్మిల యాత్రపై నో

ఇలాంటి సమయంలో చంద్రబాబు ఆంధ్రజ్యోతి ఓపెన్ డిబేట్‌లో పలు అంశాలపై స్పందించారు. హరికృష్ణతో ఎలాంటి వివాదం లేదని, అతను విశాఖలో పాదయాత్ర ముగింపు సభకు ఎందుకు రాలేదో తెలియదని, ఆయనే చెప్పాలని, కుటుంబమంతా కలిసి ఉండాలని తాను కోరుకుంటున్నానని, అందరికీ గౌరవం ఇస్తానని చెప్పారు. అయితే రాజకీయాలు వేరు, కుటుంబం వేరని, పార్టీకి ఎవరు ఇబ్బందులు తేవద్దన్నారు.
బాలకృష్ణ పదవి
బాలకృష్ణకు ఏ పదవి ఇస్తారనే అంశంపై మాట్లాడుతూ... వారి వారి ఆసక్తిని బట్టి బాధ్యతలపై స్పష్టత ఇస్తామని, పార్టీయే సుప్రీం అన్నారు. అందరు పార్టీని బలోపేతం చేయాల్సిందేనని, ఎవరి గౌరవం వారికి ఉంటుందన్నారు. బాలకృష్ణకైనా మరెవరికైనా తాను పార్టీ కోసం అవసరమైన సందర్భాలలో ముక్కుసూటిగా చెప్పగలనన్నారు.
లోకేష్ ఆరంగేట్రం
తన తనయుడు నారా లోకేషే కాకుండా ఎవరు రాజకీయాల్లోకి వచ్చినా నిబద్దతతో పని చేయాలని, పెత్తనం ఉండకూడదని, సేవాభావంతో రావాలని చెప్పానన్నారు. లోకేష్ రాజకీయ భవిష్యత్తు ఆయన పని తీరు నిర్ణయిస్తుందని చెప్పారు. లోకేష్‌ను ఈ స్థాయికి తెచ్చింది భువనేశ్వరే అన్నారు. రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల తాను ఎప్పుడు పట్టించుకోలేదన్నారు.
జాగ్రత్త చెప్పారు
తాను పాదయాత్ర చేస్తున్న సమయంలో తన భార్య వద్దని చెప్పలేదని అయితే, జాగ్రత్తగా ఉండమని మాత్రం హెచ్చరించిందన్నారు. తనను ఎప్పుడు వెనక్కి లాగలేదన్నారు.
షర్మిల, కెసిఆర్‌లుపై...
షర్మిల పాదయాత్ర పోటీగా భావించారా? అంటే వ్యక్తుల గురించి మాట్లాడనని చెప్పారు. తాను జాతీయ రాజకీయాలను శాసించానని, ఇప్పుడు తన గురించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుల చరిత్ర ఏమిటన్నారు.
హావబావాలపై...
జీవితంలో అన్నీ ఉంటాయని అయితే, ఉప్పొంగడం, కుంగిపోవడం తనకు తెలియదని, ప్రజల్లోకి వెళ్లాక వారి బోళాతనం, కొన్ని ఘటనలు స్పందించేలా చేశాయన్నారు. తాను ఇప్పుడు మారిన మనిషినని, 1999కి ముందు చంద్రబాబును చూస్తారన్నారు. అప్పుడు ఆత్రుతలో తప్పులు దొర్లాయన్నారు. ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తానని, రాష్ట్రాన్ని బాగు చేయాలంటే టిడిపికే సాధ్యమన్నారు.












Click it and Unblock the Notifications