చిరంజీవికి చికాకు: అమ్మాయే తెలియదని శిరీష్ ఆవేదన
హైదరాబాద్: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవికి ఆయన వారసులు వరుసగా చిక్కులు కలిగిస్తున్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటి నుండి పలుమార్లు ఆయన కుటుంబం వార్తల్లో పతాక శీర్షికలకెక్కింది. అవి వివాదాస్పదమైనవే కావడం గమనార్హం. ఆయన తాను స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసు పార్టీలో విలీనం చేసి, కేంద్రమంత్రిగా అయ్యాక ఒకటి రెండు వివాదాలు చుట్టుముట్టాయి.
ఓ స్టార్ హీరో కుటుంబ సభ్యులే కాకుండా వారు స్వయంగా హీరోలు కావడం, చిరంజీవి కేంద్రమంత్రిగా ఉండటం వల్ల ఆ వివాదాలు కేసులుగా నమోదు కాకుండా పై నుండి ఒత్తిళ్లు వస్తున్నాయనే ఆరోపణలు కూడా మెగాస్టార్ ఎదుర్కోవాల్సి వస్తోంది. స్వతహాగా చిరంజీవి నెమ్మదస్తుడు, సెన్సిటివ్. అలాంటి చిరంజీవికి ఆయన కుటుంబ సభ్యులే వరుసగా చిక్కులు తెస్తున్నారని అంటున్నారు. చిరు రాజకీయాల్లోకి ప్రవేశించిన కొత్తలో ఆయన కూతురు ప్రేమ వ్యవహారం పెద్ద ఇష్యూ అయింది.

అది ఆయన రాజకీయ ఆరంగేట్రానికి పెద్ద మైనస్‌గా అప్పుడు పరిశీలకులు భావించారు. చిరు పిఆర్పీని కాంగ్రెసులో విలీనం చేశాక... ఇటీవలి కాలంలో ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ, అల్లుడు అల్లు శిరీష్ స్వల్ప వ్యవధిలోనే రెండుసార్లు పతాక శీర్షికలకెక్కారు. గత నెల మొదటి వారంలో బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో రామ్ చరణ్ తేజ తాజ్ కృష్ణ హోటల్ వద్ద ఇద్దరు యువకులపై దాడి చేసినట్లుగా వార్తలు వచ్చాయి.
ఆ ఘటనలో రామ్ చరణ్ తేజది తప్పు ఉన్నాలేకున్నా.. ఓ సెలబ్రిటీగా ఆయన ఆవేశపడి ఉండకూడదని పలువురు అభిప్రాయపడ్డారు. చెర్రీ ఘటనలో యువకులు మద్యం తాగి గొడవ చేశారని, అందులో అతని తప్పు లేదని ఓ సందర్భంలో నాగబాబు చెప్పారు. రామ్ చరణ్ ఘటన మరవకముందే ఇప్పుడు అల్లు అరవింద్ తనయుడు, చిరంజీవి అల్లుడు అయిన అల్లు శిరీష్ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ జోరుగా ప్రచారం సాగింది.
చెర్రీ అంశం కేవలం గొడవ మాత్రమే. కానీ శిరీష్ మాత్రం.. శనివారం రాత్రి పబ్‌లో ఓ మహిళా డిజె పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లుగా టీవి ఛానళ్లలో జోరుగా ప్రచారం జరిగింది. ముగ్గురు యువకులు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో అల్లు శిరీష్ ఉన్నారని, కేసు నమోదు కాకుండా పెద్దల నుండి ఒత్తిళ్లు వస్తున్నాయని ప్రచారం జరిగింది. చెర్రీ విషయంలో తప్పెవరిదైనా, శిరీష్ పైన వచ్చినవి కేవలం ఉత్తివే అయినా... ఇలాంటివి చిరంజీవిపై ప్రభావం పడతాయని అంటున్నారు.
స్పందించిన అల్లు శిరీష్
అయితే దీనిపై అల్లు శిరీష్ వివరణ కూడా ఇచ్చారు. పొరపాటున తన పేరును చెప్పారని, వివాదాల్లోకి సెలబ్రిటీలను లాగడం పరిపాటైందని అతను ఆవేదన వ్యక్తం చేశారు. పబ్‌లో జరిగిన గొడవకు తనకు ఎలాంటి సంబంధం లేదని, పొరపాటున తనపై ఫిర్యాదు చేశారని, పబ్‌లో తాను గడిపింది అరగంటేనని, ఎవరితోను గొడవ పెట్టుకోలేదని ఆయన చెప్పారు. కేసు పెట్టిన అమ్మాయి ఎవరో తనకు తెలియదని చెప్పారు. తనకు సంబంధంలేని వివాదాల్లోకి తనను లాగవద్దన్నారు.












Click it and Unblock the Notifications