ఎన్నాళ్లకెన్నాళ్లకు?: కావూరికి బెర్త్, విహెచ్‌కు అవకాశం

రాష్ట్రం తరఫున ఇప్పటికి పదిమంది కేంద్రమంత్రులు ఉన్నారు. ఇలాంటి స్థితిలో మంత్రివర్గంలో మన రాష్ట్రం నుండి అవకాశం కష్టమే. అయితే రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఒకరికి లేదా ఇద్దరికి అవకాశాలుంటాయని చెబుతున్నారు. తెలంగాణ ప్రాంతం నుండి విహెచ్, సీమాంధ్ర ప్రాంతం నుండి కావూరి సాంబశివ రావులలో ఎవరో ఒకరికి లేదా ఇద్దరికి ఛాన్స్ ఉందంటున్నారు.
విహెచ్, కావూరిలు ఎప్పటి నుండి కేంద్రమంత్రివర్గంలో చోటు కోసం ఎదురు చూస్తున్నారు. విహెచ్ ప్రతిసారి ఆశలు పెట్టుకుంటున్నప్పటికీ చోటు దక్కకపోయినా ఆయన తన అసంతృప్తిని పెద్దగా వెళ్లగక్కడం లేదు. అయితే కావూరి మాత్రం ఎదురు చూసి ఇటీవలే కఠిన నిర్ణయం తీసుకున్నారు.
తాను ఎన్నో ఏళ్ల నుండి కాంగ్రెసు పార్టీలో కొనసాగుతూ, పార్టీ అభివృద్ధి కోసం పాటుపడుతున్న తనను అధిష్టానం విస్మరిస్తోందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన గతేడాది చివర్లో తన పదవికి రాజీనామా చేశారు. తాను కాంగ్రెసులోనే ఉంటానని చెప్పినప్పటికీ ఆయన జగన్ పార్టీ వైపు వెళ్తారనే ప్రచారం సాగింది.
ఈ నేపథ్యంలో కొద్ది నెలల క్రితం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో కావూరి భేటీ అయ్యారు. అనంతరం రాజీనామా ఉపసంహరించుకున్నారు. త్వరలో పునర్వ్యవస్థీకరణ ఉంటుందని, ఈసారి తప్పకుండా అవకాశమిస్తామని చెప్పినందువల్లే ఆయన అప్పుడు చల్లబడి ఉంటారంటున్నారు. సాధారణ ఎన్నికలకు ముందు ఇదే ఆఖరి కేబినెట్ విస్తరణ కావొచ్చు. ఇలాంటి స్థితిలో తనను పరిగణలోకి తీసుకోకుంటే కావూరి మరోసారి కఠిన నిర్ణయం తీసుకునే అవకాశాలు లేకపోలేదు. ఈసారి కేంద్రమంత్రి వర్గంలో ఎనిమిది మంది కొత్త వారికి చోటు దక్కే అవకాశాలున్నాయి. నాలుగు కేంద్ర పదవులు, నాలుగు సహాయ మంత్రి పదవులు లభించనున్నాయి.
కావూరికి పిలుపు
కావూరి సాంబశివ రావుకు అధిష్టానం నుండి ఫోన్ వచ్చింది. దీంతో ఆయన హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు. జంగారెడ్డిగూడంలోని అభివృద్ధి కార్యక్రమాలు వాయిదా వేసుకొని ఆయన ఢిల్లీ బయలుదేరారు. కావూరికి బెర్త్ ఖాయమైంది. విహెచ్, జెడి శీలం, నంది ఎల్లయ్యలకు కూడా పిలుపు వచ్చే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications