3..2..1..: తెలంగాణపై కాంగ్రెస్ స్కెచ్, ఇక తీర్మానమే?
హైదరాబాద్: తెలంగాణపై కాంగ్రెసు పార్టీ అధిష్టానం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని అంటున్నారు. మొదట భారీ ప్యాకేజీ, తర్వాత రాయల తెలంగాణ, ఆ తర్వాత తెలంగాణ... ఇలా తెలంగాణకు పరిష్కార మార్గాలు అధిష్టానం యోచిస్తోందంటూ పలు అంశాలు బయటకు వచ్చాయి. అయితే ఇవన్నీ కాంగ్రెసు పార్టీ వ్యూహంలో భాగమేనని అంటున్నారు. కాంగ్రెసు పార్టీకి ఆంధ్రప్రదేశ్ చాలా కీలకమైన రాష్ట్రం.
గత ఎన్నికలలో 33 స్థానాల్లో గెలుపొందింది. పలువురు పార్లమెంటు సభ్యులు పార్టీని వీడినప్పటికీ వచ్చే ఎన్నికలలో కేంద్రంలో అధికారం చేజిక్కించుకోవాలంటే రాష్ట్రంలో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలలో గెలవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తమకు ప్రధానంగా ఉన్న తెలంగాణ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పైన ఆ పార్టీ దృష్టి సారించింది. ప్రధానంగా తెలంగాణ అంశంపై అధిష్టానం తర్జన భర్జన పడుతోంది. తెలంగాణ విషయంలో ఓ స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని ఇరు ప్రాంతాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

తెలంగాణ విషయంలో కాంగ్రెసు పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని అంటున్నారు. ఇటీవల వచ్చిన ప్యాకేజీ, రాయల తెలంగాణ, తెలంగాణ.. ఇవన్నీ ఢిల్లీ పెద్దల వ్యూహాత్మక లీకేజి ఫలితమే అంటున్నారు. తెలంగాణ సమస్య పరిష్కారంలో భాగంగా ఎలా పరిష్కరిస్తే.. సులభమవుతుందని, పార్టీకి ఏ మేరకు లబ్ధి చేకూరుతుందనే అంశాన్ని గమనించేందుకే ఈ లేకేజీ వ్యవహారం నడిపిస్తోందనే వాదనలు లేకపోలేదు.
ఆయా ప్రకటనల ద్వారా ఇరు ప్రాంతాల నుండి ఎలాంటి స్పందన వస్తుందనే అంశాన్ని గమనిస్తోందని అంటున్నారు. ఎన్నికల నాటికి తెలంగాణ సమస్యకు పరిష్కారం చూపించకుంటే పార్టీ ఇరు ప్రాంతాల్లోను నష్టపోయే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు ఓ పరిష్కారం చూపించడమే కాకుండా, తద్వారా పార్టీ ఎక్కువ లాభం పొందే పరిష్కారం కోసం చూస్తోందని అంటున్నారు. తమ పార్టీకి లబ్ధి చేకూరే కోణంలోనే ఢిల్లీ పెద్దలు సమస్య పరిష్కరిస్తారని అంటున్నారు.
అందుకే గత కొన్ని రోజులుగా విరుద్ధ ప్రచారాలతో రాష్ట్రంలోని స్పందనను గమనిస్తున్నారని అంటున్నారు. మొదట భారీ ప్యాకేజీ అని, ఆ తర్వాత రాయల తెలంగాణ, ఇప్పుడు తెలంగాణ అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పుడు తెలంగాణ ప్రాంత నేతలు నిర్వహిస్తున్న తెలంగాణ సాధన సభ కూడా అధిష్టానం వ్యూహంలో భాగమేనంటున్నారు. ఈ సభ ద్వారా వచ్చే కొత్త ఊపుతో స్థానిక ఎన్నికలతో పాటు సాధారణ ఎన్నికలలో కూడా లబ్ధి పొందాలని చూస్తున్నారని అంటున్నారు.
తీర్మానమా? తెలంగాణా?
తెలంగాణపై అధిష్టానం మరో వ్యూహానికి సిద్ధమవుతోందని ఆంగ్ల మీడియాలో వార్తలు వచ్చాయి. వచ్చే అసెంబ్లీ సమావేశాలలో తెలంగాణపై తీర్మానం పెట్టాలనే యోచనలో ఉందని అంటున్నారు. తీర్మానం ప్రవేశపెడితే మెజార్టీ సభ్యులు వ్యతిరేకిస్తారని అధిష్టానం భావిస్తోందట. కాంగ్రెసు పార్టీలో ఎలాగు రెండు ప్రాంతల నేతల మధ్య విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
తీర్మానం పెట్టి, అది వీగిపోతే దాని ఆధారంగా మరికొంతకాలం వేచి ఉండవచ్చునని చూస్తోందని అంటున్నారు. అదే సమయంలో ఆ తీర్మానం ద్వారా చంద్రబాబు, జగన్‌లను ఇరుకున పడేయాలని చూస్తోందని అంటున్నారు. తెలంగాణపై ఎలాంటి పరిష్కారం చేసినా ఢిల్లీ పెద్దలు తమ పార్టీకి లబ్ధి చేకూరడంతో పాటు జగన్, కెసిఆర్, చంద్రబాబులను దెబ్బతీసే విధంగా వ్యూహాలు రచిస్తున్నారట.












Click it and Unblock the Notifications