మీరు మారండి, లేదంటే మార్చేస్తా: చంద్రబాబు వార్నింగ్
హైదరాబాద్: మైండ్ సెట్ మార్చుకోవాలని లేదంటే మిమ్మల్నే మార్చేస్తానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శనివారం పార్టీ ఇంఛార్జులను ఉద్దేశించి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు నిర్వహిస్తున్న సదస్సులో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడితే సహించబోమని, మంత్రులు, అధికార పార్టీ ఎంపీలు, శాసన సభ్యులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఊరుకోమని కూడా ప్రభుత్వంపై మండిపడ్డారు.
ఉత్తరాఖండ్ వరద బాధితులకు సహాయ కార్యక్రమాలు మొదలు పెట్టినప్పుడు చేతిలో పైసా లేదని, తాము అధికారంలో లేమని అయినా, ప్రభుత్వాని కంటే బాగా చేశామని, అలాగే రైతు రుణ మాఫీ కూడా చేసి చూపిస్తామన్నారు. ఎలా చేస్తారంటూ ప్రశ్నలు వేస్తున్న పార్టీల నేతలు మనం ఎలా చేశామో చూసి లెంపలు వేసుకొనేలా చేస్తామన్నారు. ఈసారి ఎన్నికల్లో టిడిపి గెలుపు చారిత్రక అవసరమని, ఈ విషయాన్ని ప్రతి ఇంటికి వెళ్లి వంద సార్లు.. వినకపోతే వెయ్యి సార్లైనా చెప్పి ప్రజలను మన దారిలోకి తెచ్చుకోవాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒబామా తరపున ప్రచారం చేసిన కార్యకర్తలు ఇదే వ్యూహం అవలంబించారన్నారు. కాంగ్రెస్ పాలనలో దుస్థితిని, టిడిపి ఇచ్చిన హామీలను పునరుద్ఘాటించారు. మీకు అస్త్రాలు ఇవ్వడానికే ఈ సదస్సు అని, చెప్పిన మాట వినకపోతే అభిమన్యుడిలా చిక్కుకొనిపోతారని, చెప్పిన వ్యూహంతో వెళ్లాలని, గెలిచి రావాలని హితబోధ చేసారు. సహకార ఎన్నికల్లో టిడిపికి దరిదాపుల్లో నిలవలేకపోయిన పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నాయని ఎద్దేవా చేశారు.
సహకార ఎన్నికల్లో అధికార పార్టీ డబ్బు, అధికారం అన్నీ విరజిమ్మి 12 వేల సొసైటీలు గెలుచుకొంది. అవేమీ లేకుండా మనం 8 వేలు గెలుచుకొన్నాం. తెరాసకు వచ్చింది 125, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి 399 వచ్చాయన్నారు. ఈసారి కేంద్రంలో వచ్చేది మూడో కూటమేనని, అక్కడ చక్రం తిప్పేది మనమేనని బాబు స్పష్టం చేశారు. తనకు కోరికల్లేవని, తాను చూడని అధికారం లేదని, రెండుసార్లు ముఖ్యమంత్రిగా రెండుసార్లు ప్రతిపక్ష నేతగా చేశానని, రాష్ట్రాన్ని బాగు చేయడం కోసమే టిడిపి గెలవాలని కోరుకుంటున్నానన్నారు.












Click it and Unblock the Notifications