విభజన: రాజీనామాలకు అంత లేదా, 17లోగా ప్రకటన?

కాంగ్రెసు పార్టీ కోర్ కమిటీ ఈ నెల 12వ తేదిన భేటీ అయి తెలంగాణపై ఓ నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. 17వ తేదిలోగా తెలంగాణపై ఓ నిర్ణయం వెలువడే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ ప్రాంత నేతలు భావిస్తున్నారట. అది తెలంగాణకు అనుకూలంగా ఉంటుందని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు ధీమా వ్యక్తం చేస్తుండగా, సీమాంధ్ర నేతలు మాత్రం ఉలిక్కిపడుతున్నారు. అధిష్టానం నిర్ణయం తెలంగాణకు అనుకూలంగా ఉంటుందనే సమాచారం కారణంగానే సీమాంధ్ర నేతలు రాజీనామాల పరంపరకు తెరలేపారంటున్నారు.
అయితే గతంలో వలె ఈసారి అధిష్టానం ఓ నిర్ణయం తీసుకున్నా దానిపై వెనక్కి తగ్గే అవకాశాలు కనిపించడం లేదంటున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమ నేత శైలజానాథ్ స్వయంగా ఈ విషయాన్ని మూడు రోజుల క్రితం చెప్పారు. సీమాంధ్ర నేతలు ఒక్కతాటి పైకి రావడం లేదని, నిర్ణయం వెలువడ్డాక వెళ్లి ప్రయత్నాలు చేసినా లాభం లేదని, ఇప్పుడే సమైక్యాంధ్రకు అనుకూలంగా లాబీయింగ్ చేయాలని సూచించారు.
పలువురు సీమాంధ్ర కాంగ్రెసు నేతలు రాజీనామాలకు సిద్ధంగా ఉన్నప్పటికీ 2009లో వచ్చినంత ఊపు ఉండదని భావిస్తున్నారు. నాడు పార్టీలకతీతంగా కాంగ్రెసు, టిడిపి ఎమ్మెల్యేలు వరుసగా రాజీనామా చేశారు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సైలెంట్‌గా ఉంది. కాంగ్రెసు పార్టీకి చెందిన కావూరి సాంబశివ రావు లాంటి నేతలు రాజీనామాలు చేసే పరిస్థితి లేదు. నాడు వంద మందికి పైగా రాజీనామాలు చేస్తే.. ఇప్పుడు పదులల్లో మాత్రమే ఉండవచ్చునని భావిస్తున్నారు.
కాంగ్రెసు తెలంగాణపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఈసారి ఆచితూచి స్పందించే అవకాశాలున్నాయి. తెలంగాణ టిడిపి నేతలు మాత్రమే కాకుండా సీమాంధ్ర టిడిపి నేతల వ్యాఖ్యలు కూడా తెలంగాణకు కాస్త అనుకూలంగానే కనిపిస్తున్నాయి. తాము తెలంగాణకు అనుకూలంగా ఎప్పుడో తీర్మానం చేశామని, అసెంబ్లీలో తీర్మానం పెడితే మాత్రం ఆలోచిస్తామని, నిర్ణయం మాత్రం కేంద్రం చేతిలో ఉందని కెఈ ప్రభాకర్ నాలుగు రోజుల క్రితం అన్నారు.
ఇక ఈ రోజు కడప జిల్లాకు చెందిన పలువురు నేతలు రాయలసీమను విడగొట్టవద్దంటూ రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారిలో ఇద్దరు వైయస్సార్ కాంగ్రెసు, ఒక కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. టిడిపి ఎమ్మెల్యే లింగారెడ్డి కూడా రాజీనామాకు సిద్ధంగా ఉన్నారని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. అయితే లింగారెడ్డి మాత్రం షాక్ ఇచ్చారు. తాను రాజీనామా చేస్తానని చెప్పలేదని, తెలంగాణ విషయంలో తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిర్ణయమే ఫైనల్ అని తేల్చి చెప్పారు.
తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెసు పార్టీ నిర్ణయం ప్రకటించినా టిడిపి నేతలు బాబు గీత దాటే అవకాశాలు లేదంటున్నారు. అయితే కేంద్రం తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేస్తే మాత్రం కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలతో కలిసి బాబు గీసిన గీతను టిడిపి నేతలు దాటే అవకాశాలు లేకపోలేదంటున్నారు. కాంగ్రెసు తెలంగాణకు అనుకూలంగా ప్రకటిస్తే అది పార్టీ నిర్ణయమని సీమాంధ్ర టిడిపి తప్పించుకుంటుందని కానీ, కేంద్రం ప్రకటిస్తే మాత్రం తప్పించుకునే అవకాశం లేదంటున్నారు.
కడప జిల్లా నేతలు రాజీనామాలు చేయడంతో కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వారు రాజీనామాలకు మరోసారి తెరదీశారన్నారు. అధిష్టానం నిర్ణయం ప్రకటనకు ముందు రాజీనామాల పర్వం ఇంతటితో ఆగుతుందా? లేక కొనసాగుతుందా? అనేది రేపటి నుండి తెలుస్తుందంటున్నారు. అయితే 2009 వచ్చినంత ఊపు మాత్రం రాదని పరిశీలకులు భావిస్తున్నారు.
అధిష్టానం ఓ నిర్ణయం ప్రకటిస్తే... కాంగ్రెసు పార్టీ నిర్ణయమని టిడిపి తప్పించుకునేందుకు అవకాశం ఉండటం ఓ కారణమని, అదే దార్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నడువవచ్చునని అంటున్నారు. ఇక కాంగ్రెసు పార్టీ నేతలు కొందరు వెనక్కి పోవచ్చునని భావిస్తున్నారు. అందుకు కావూరి మంచి నిదర్శనమంటున్నారు. కొందరు రాజీనామా చేసినా ఇబ్బంది లేదని, ఇంకొంతమంది ఏమీ చేయలేక పార్టీలో ఉంటారని అధిష్టానం భావిస్తోందని అంటున్నారు.












Click it and Unblock the Notifications