తెలంగాణతో అలర్ట్: కిరణ్‌కు బొత్స కౌంటర్, జగన్ మెలిక
హైదరాబాద్: తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెసు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందనే ప్రచారం జోరుగా జరుగుతున్న నేపథ్యంలో పలువురు సీమాంధ్ర నేతలు జాగ్రత్త పడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కోర్ కమిటీలో ఇచ్చి ప్రజెంటేషన్ పైన రోజుకో వార్త వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అది వ్యూహాత్మక లీకేజ్ అనే అనుమానాలను పలువురు వ్యక్తం చేశారు.
తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వెలువడుతుందనే ప్రచారం నేపథ్యంలో పలువురు నేతలు ఎవరికి వారు సీమాంధ్రలో సమైక్య ముద్ర కోసం పరితపిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. 2014 ఎన్నికల్లో మరోసారి తానే 'ముఖ్య' నేతగా ఎదిగే ఉద్దేశ్యంలో భాగంగానే కిరణ్ తన ప్రజెంటేషన్‌ను తన వర్గం ద్వారా లీకులు చేయించు ఉంటారని అంటున్నారు. అయితే కిరణ్‌కు అంత అవసరం లేదని ఆయన వర్గం చెబుతోంది.

తాజాగా ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా సమైక్య ముద్ర కోసం పరితపిస్తున్నారా? అనే అనుమానం పలువురిలో రేకెత్తిస్తోంది. ఇన్నాళ్లు కిరణ్ ప్రజెంటేషన్ రాగా.. బుధవారం కోర్ కమిటీలో బొత్స ఏం చెప్పారనే అంశం వెలుగులోకి వచ్చింది. ఇది కూడా ఉద్దేశ్య పూర్వకంగా లీక్ కావొచ్చునని అంటున్నారు. ముఖ్యమంత్రికి బొత్స వర్గం కౌంటర్‌గా పలువురు భావిస్తున్నారు.
మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కేంద్రం తీసుకోబోయే నిర్ణయం పైన కొత్త మెలిక పెట్టినట్లుగా కనిపిస్తోంది. ఈ రోజు జగన్ పార్టీ నేతలు కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు ఓ లేఖ రాశారు. కోర్ కమిటీ తెలంగాణపై తేల్చేస్తుందని అందరూ చూశారని కానీ, నిర్ణయం దిగ్భ్రాంతి కలిగించిందని లేఖలో పేర్కొంది. ఇటు కాంగ్రెసు, అటు కేంద్రం తెలంగాణపై వైఖరి చెప్పలేదని, చెప్పకుండానే అభిప్రాయం ప్రకటించడం సరికాదన్నారు.
ముందుగా కాంగ్రెసు, కేంద్రం వైఖరి స్పష్టం చేసి, ఆ తర్వాత అందరి అభిప్రాయాలను తీసుకోవాలని సూచించింది. మిగిలిన పార్టీ నేతలతో విస్తృత చర్చ జరపాలని కోరారు. ఈ ప్రక్రియ లేకుండా ఏకపక్ష నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఏ ప్రాంతానికి అన్యాయం జరగవద్దని వారు అందులో విజ్ఞప్తి చేశారు. అయితే కేంద్రం నిర్ణయం తీసుకోవడం కాకుండా, వైఖరిని స్పష్టం చేసి మరోసారి అందరి అభిప్రాయాలు తీసుకోవాలని కోరటం కొత్త మెలికే అంటున్నారు.
కాగా బుధవారం కూడా ఢిల్లీలో తెలంగాణపై వాడిగా వేడిగా చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు ఉదయం దిగ్విజయ్ సింగ్‌ను సభాపతి నాదెండ్ల మనోహర్ కలిశారు. మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. రాష్ట్రాన్ని విభజించాలని కోరినట్లుగా తెలుస్తోంది. దిగ్విజయ్‌ను కడప జిల్లాకు చెందిన మంత్రి అహ్మదుల్లా కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ గురువారం ఢిల్లీ వెళ్లనున్నట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications