సామాన్యులకు చంద్రబాబు శుభవార్త..త్వరలో తక్కువ ధరలకు కందిపప్పు, వంటనూనెలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుపేదలకు శుభవార్త. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపరీతంగా పెరిగిన బియ్యం ధరల నేపథ్యంలో సబ్సిడీపై బియ్యం ఇవ్వడానికి సంకల్పించిన ప్రభుత్వం సబ్సిడీ ధరల పైన బియ్యాన్ని మార్కెట్లలో అందుబాటులోకి తెచ్చింది. ఇక తాజాగా పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నిరుపేదలకు లబ్ధి కలిగించే మరొక కీలక నిర్ణయం తీసుకొని ఈ మేరకు ప్రకటన చేశారు.
రైతు బజార్ల ద్వారా కందిపప్పు, వంట నూనె
త్వరలోనే రైతు బజార్ల ద్వారా కందిపప్పు, వంట నూనెలు తక్కువ ధరకు విక్రయిస్తామని వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకే అందిస్తున్న ప్రభుత్వం, ఇప్పుడు మరిన్ని నిత్యవసర వస్తువులను కూడా మార్కెట్లో అందుబాటులోకి తీసుకురావడానికి నిర్ణయం తీసుకుంది. ఇది పెరిగిన ధరలతో నిత్యావసరాలను కొనుగోలు చేసుకోలేకపోతున్న వారికి ఒక పెద్ద ఉపశమనం.

ఇప్పటికే తక్కువ ధరలకు బియ్యం అందిస్తున్న సర్కార్
ఇక ఇదే విషయాన్ని వెల్లడించిన మంత్రి నాదెండ్ల మనోహర్ బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు పెరిగిన నేపథ్యంలో, బియ్యం ధరలను తగ్గించి ప్రజలకు ఊరట కల్పించేందుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ప్రస్తుతం బిపిటి స్టీమ్డ్ రైస్ 52 రూపాయలకు, బిపిటి రా బియ్యం కిలో 50 రూపాయలకు విక్రయిస్తున్నారు. రాష్ట్రంలోని 150 రైతు బజార్లు, 500 రైస్ మిల్ అవుట్ లెట్ల ద్వారా ఈ సేవలు అందిస్తున్నారు.
నిరుపేద మధ్యతరగతి ప్రజల కోసం నిర్ణయం
ఇదే క్రమంలో కందిపప్పు, పామాయిల్ వంటి వాటిని కూడా తక్కువ ధరకు అందించాలని ప్రభుత్వం ఆలోచనలో ఉంది. ధరల స్థిరీకరణ పైన నిరంతరం దృష్టి సారిస్తున్న ప్రభుత్వం, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడడం కోసం చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఏపీ పౌరసరఫరాల శాఖ నాదెండ్ల మనోహర్ తెలిపారు.
ప్రభుత్వ నిర్ణయంపై సామాన్య , మధ్యతరగతి ప్రజల హర్షం
మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదల నేపథ్యంలో, సబ్సిడీ పైన ప్రజలకు అవసరమైన నిత్యావసరాలను అందించే పనిలో ఉంది ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాల పట్ల సామాన్య , మధ్యతరగతి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.













Click it and Unblock the Notifications