ఇక్కడ ఉమ్మెయండి! మెట్రో స్టేషన్లలో టచ్‌లెస్ ‘స్పిట్ బిన్’ వైరల్.
ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడపడితే అక్కడ ఉమ్మేయకూడదని అధికారులు పదే పదే హెచ్చరిస్తుంటారు. ఒకవేళ అలా చేస్తే జరిమానాలు కూడా కట్టాల్సి వస్తుంది. కానీ, ముంబై మెట్రో స్టేషన్‌లో మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నమైన దృశ్యం కనిపించింది. ప్రయాణికులు ఉమ్మేయడం కోసం ఏకంగా ఒక ప్రత్యేకమైన టచ్‌లెస్ 'స్పిట్ బిన్'ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అసలు మెట్రో స్టేషన్‌లో ఉమ్మేయవచ్చా లేక ఇదో వింత ప్రయోగామా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఫొటో
ముంబైకి చెందిన జోరు భతేనా అనే వ్యక్తి ఎక్స్ వేదికగా ఈ టచ్‌లెస్ స్పిట్ బిన్ ఫొటోను షేర్ చేశారు. "నా ముంబై మెట్రో.. ఇప్పుడు ప్రత్యేకమైన ఉమ్మేసే జోన్లతో" అంటూ ఆయన క్యాప్షన్ పెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మహా ముంబై మెట్రో స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ఈ బిన్‌పై ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MMRDA) లోగోలతో పాటు 'బాధ్యతాయుతంగా ఉండండి' అనే సందేశం కూడా ఉంది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి నిర్దిష్ట ఉమ్మేసే ప్రదేశం అని పేర్కొంటూ, దీన్ని ఎలా ఉపయోగించాలో మరాఠీ, ఇంగ్లీష్ భాషల్లో రాశారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా, చేతులతో ముట్టుకోకుండా వాడేలా ఈ టచ్‌లెస్ బిన్‌ను 'ఈజీస్పిట్' అనే సంస్థ రూపొందించింది.

ఉమ్మేయొచ్చా? లేక రూ. 500 జరిమానా కట్టాలా?
పబ్లిక్ ప్రదేశాలను మురికి చేయకుండా ఉండాలనే మంచి ఉద్దేశంతోనే ఈ ఏర్పాట్లు చేసినట్లు అనిపించినప్పటికీ, ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది. ముంబై మెట్రో రైల్వే కార్పొరేషన్ అధికారిక వెబ్‌సైట్ నిబంధనల ప్రకారం.. మెట్రో పరిధిలో ఉమ్మేయడం, అసభ్యకరంగా ప్రవర్తించడం లేదా ప్రయాణికులకు అసౌకర్యం కలిగించడం చట్టరీత్యా నేరం. సెక్షన్ 59(1) ప్రకారం మెట్రోలో ఉమ్మితే ఏకంగా రూ. 500 జరిమానా విధించడంతో పాటు, వారి టికెట్ లేదా పాస్‌ను రద్దు చేసి బయటికి గెంటెసే అవకాశం ఉంది. దీంతో మెట్రోలో ఉమ్మడం నేరమైనప్పుడు, ఇక్కడ ప్రత్యేకంగా బిన్‌లు ఎందుకు ఏర్పాటు చేశారంటూ నెటిజన్లు అయోమయంలో పడ్డారు.
మిశ్రమ స్పందన ఇస్తున్న నెటిజన్లు
ఈ వింత పరిస్థితిపై సోషల్ మీడియాలో భిన్నమైన చర్చ నడుస్తోంది. ఒకవైపు బహిరంగ ప్రదేశాలను మురికి చేసే అలవాటు ఉన్నవారికి ఇదొక చక్కటి నియంత్రణ చర్య అని కొందరు సమర్థిస్తున్నారు. గోడలపై, స్టేషన్లలో ఎక్కడపడితే అక్కడ ఉమ్మెయడం కంటే, ఇలాంటి పరిశుభ్రమైన ఏర్పాట్లు ఉండటం మంచిదేనని వాదిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం.. నిబంధనలు ఒకలా ఉంటే, ఇలాంటి ఏర్పాట్లు చేయడం ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతుందని విమర్శిస్తున్నారు. ఏదేమైనా, రైలు ఎక్కకుండానే ముంబై మెట్రో మాత్రం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.














Click it and Unblock the Notifications
