ఎపి భవన్‌లో దాడి: హరీష్ రావు, టిఆర్ఎస్ నేతల రాజీ

ఈ కేసులో తాము రాజీ కుదుర్చుకున్నట్లు వారు కోర్టుకు తెలపడంతో కోర్టు ఈ కేసును కొట్టి వేసింది. తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న యాది రెడ్డి మృతదేహాన్ని ఎపి భవన్‌లోకి అనుమతించలేదన్న కోపంతో చందర రావుపై హరీశ్ రావు భౌతికంగా దాడి చేశారు. అధికారి పైన చేయి చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో ఆయన 2011 జూలై 22న తిలక్‌మార్గ్ పోలీస్ స్టేషన్‌లో ముగ్గురు తెరాస ఎమ్మెల్యేలతోపాటు, మాజీ పార్లమెంటు సభ్యుడు వినోద్ కుమార్ పైనా కేసు నమోదు చేశారు. తదనంతర పరిణామాల నేపథ్యంలో ఈ కేసులో తాము రాజీకి వచ్చినట్టు చందర రావు, తెరాస నాయకులు హైకోర్టుకు తెలిపారు.
దీంతో ఈ కేసును కొట్టివేస్తున్నట్టు న్యాయమూర్తి జస్టిస్ హిమ కోహ్లి కొద్ది రోజుల కిందట తీర్పు వెలువరించారు. కాగా, చందర రావు ఎస్సీ కావడంతో ఎపి భవన్ ఘటనపై ఎస్సీ కమిషన్‌లో కూడా కేసు నమోదైంది. ఈ కేసు తుదివాదనల నిమిత్తం తెరాస నాయకులు ఇటీవల ఢిల్లీకి వచ్చారు. భౌతిక దాడి జరిగిన సంగతి వాస్తవమేగానీ అందులో ఎస్సీ అట్రాసిటీ ఏమీ లేదని కేసు విచారణ జరిపిన పోలీసులు చార్జిషీటు దాఖలు చేసినట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications