జోక్యం చేసుకోండి: ప్రధానికి చంద్రబాబు లేఖ

Chandrababu Naidu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని సంక్షుభిత పరిస్థితులను పరిష్కరించడానికి తక్షణం జోక్యం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రధాని మన్మోహన్ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. ఆర్థికంగా, సామాజికంగా, భావోద్వేగాల పరంగా రాష్ట్రం నాశనం అవుతున్న తీరు చూస్తుంటే బాధ కలుగుతోందని, దేశ ప్రధానిగా మీ భుజస్కంధాలపై నైతిక, రాజ్యాంగపరమైన గురుతర బాధ్యత ఉందని, రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి విభజన నిర్ణయంవల్ల తలెత్తిన సమస్యల పరిష్కారానికి ప్రధాని తనపై బాధ్యతను శిరసావహించాలని ఆయన అన్నారు.

ప్రజల్లో నెలకొన్న అపోహలు, అనుమానాలు, భయసందేహాలను తీర్చి, సంక్లిష్ట సమస్యను పరిష్కరించడానికి రంగంలోకి దిగాలని ఆయన సూచించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ హ్రస్వదృష్టితో తీసుకున్న నిర్ణయంవల్ల తెలుగువారి మధ్య విద్వేషాలు పెరగకుండా చూడాలని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన ప్రధాని మన్మోహన్ సింగ్‌కు శుక్రవారం ఓ లేఖ రాశారు.

ప్రజానీకాన్ని ఆందోళనకు గురిచేస్తున్న అంశాలేమిటో తెలుసుకొని వాటిపై చర్చించాలని, వారి ప్రయోజనాలు కాపాడాలని, వారికి న్యాయం చేయాలని ఆయన కోరారు. అధిక శాతం పార్టీలు తెలంగాణ ఏర్పాటుకు ఆమోదం తెలిపినా అధికారంలో ఉన్న పార్టీగా కాంగ్రెస్ దీనిపై నిర్ణయం తీసుకొనేముందు సీమాంధ్ర భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వకపోవడం, ఆ ప్రాంతాన్ని దిగ్భ్రాంతికి, నిర్వేదానికి, అనూహ్యస్థాయిలో ఉద్యమానికి నెట్టివేశాయని ఆయన అన్నారు.

విభజన నిర్ణయంవల్ల ప్రభావితమయ్యే వర్గాలతో తొలుత తగినంతగా చర్చలు జరిపి వారి మనోగతం తెలుసుకొనే ప్రయత్నం చేయకుండా కాంగ్రెస్ పార్టీ తుది నిర్ణయం ప్రకటించడమే ఈ సమస్యను సృష్టించిందని అన్నారు. తమ పిల్లల విద్య, ఉద్యోగ అవకాశాలు, హైదరాబాద్‌లో రక్షణ-భవిష్యత్తు అవకాశాలు, నదీజలాల పంపిణీ, కొత్త రాష్ట్రం రూపు దిద్దుకోవడానికి అవసరమైన వనరులు, ప్రస్తుత కార్యక్రమాలకు అవసరమైన నిధులు వంటి వాటిపై వారు ఆందోళనకు గురవుతున్నారని అన్నారు.

ఐదు దశాబ్దాలుగా హైదరాబాద్‌తో తాము పెంచుకొన్న అనుబంధం తెగిపోతుందన్న భావన కూడా సీమాంధ్ర ప్రజల్లో తీవ్ర అశాంతిని రేకెత్తించిందని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలవారి సమష్టి కృషితో హైదరాబాద్ పురోగమిస్తూ వస్తోందని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం పాలనలో ఇది ఒక ప్రపంచ స్థాయి నగరంగా ఎదిగిందని, పెట్టుబడులు, ఉద్యోగాలు సహా అన్ని అవకాశాలకు కేంద్రంగా మారడంవల్లే దీనిపై ఇప్పుడింత చర్చ జరుగుతోందని ఆయన అన్నారు.

ఇంత సున్నితమైన అంశాల్లో గతానుభవాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఏ పాఠాలూ నేర్చుకోలేదని, కాంగ్రెస్ సరైన రీతిలో వ్యవహరించకపోవడం నాలుగు సంవత్సరాల నుంచి రాష్ట్రాన్ని అనిశ్చితిలో పడవేసి పరిశ్రమలు, పెట్టుబడులు తరలిపోవడానికి, ఉద్యోగావకాశాలు దెబ్బతినిపోవడానికి కారణమైందని ఆయన అన్నారు. దీనికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీదే' అని ఆయన తేల్చి చెప్పారు.

సమస్యకు పరిష్కారంగా కాంగ్రెస్ పార్టీ నియమించిన ఆంటోనీ కమిటీ కూడా ఆ పార్టీ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చడానికి ఉద్దేశించినట్లే కనిపిస్తోందని, అందులో సభ్యులంతా ఆ పార్టీవారే కావడం దీనికి నిదర్శనమని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకన్నా తన రాజకీయ ప్రయోజనాలే ఆ పార్టీకి మిన్నగా మారాయని, రాష్ట్ర విభజన వ్యవహారాన్ని ఆ పార్టీ తన అంతర్గత వ్యవహారంగా చూస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో పరిపాలన స్తంభించిపోయిందని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+