నెత్తిన తుపాకి పెట్టారు: విభజనపై జగన్, విజయమ్మ

తమ రాజీనామాలతోనైనా జరగబోయే నష్టాన్ని ఆపాలని వారు కోరారు. ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయవద్దని, రాజకీయ కోణంతో విభజన వద్దని వారన్నారు. ఓ తండ్రిలా ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా కేంద్ర ప్రభుత్వం చూడాలని వారన్నారు. అందరికీ న్యాయం చేయలేకపోతే విభజన నిర్ణయం తీసుకోకూడదని వారన్నారు. కోట్లాది మంది రాష్ట్ర ప్రజలతో కాంగ్రెసు ఆటలాడుకుంటోందని విమర్శించారు.
ఓట్ల కోసం, సీట్ల కోసం చేసిన పన్నాగాన్ని తాము ఖండిస్తున్నట్లు వారు తెలిపారు. కాంగ్రెసు నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగానే తాము రాజీనామా చేస్తున్నట్లు వారు తెలిపారు. అడ్డగోలు విభజనకు అంగీకరిస్తూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నాలుగు లక్ష కోట్ల రూపాయలు అడిగారని వారు విమర్సించారు.
జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకనే..
వైయస్ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకనే కాంగ్రెసు డ్రామాలు ఆడుతోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. వైయస్ జగన్, వైయస్ విజయమ్మల రాజీనామాల విషయాన్ని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ఒంటెత్తు పోకడలను తాము నిరసిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఓట్లు, సీట్ల ప్రాతిపదికన రాష్ట్రాన్ని విభజిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవి మైసురా రెడ్డి అన్నారు. ఏ పరిష్కారం చూపకుండా కాంగ్రెసు రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిందని విమర్శించారు. పరిష్కారం చూపిన తర్వాతనే రాష్ట్రాన్ని విభజించాలని ఆయన అన్నారు.
తాము తెలంగాణ ప్రజలను గౌరవిస్తున్నామని, సమైక్యాంధ్ర నినాదంతో తాము రాజీనామాలు చేయడం లేదని, కాంగ్రెసు అధిష్టానం వైఖరికి, తీరుకు నిరసనగా రాజీనామాలు చేస్తున్నామని ఆయన చెప్పారు. తాము లేవనెత్తిన అభ్యంతరాలనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తావించారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications