ఎపిఎన్జీవో సమ్మె యథాతథం: ఇంజిన్ లేని రైలని కోదండ

సమ్మెను విరమించాలని మంత్రివర్గం ఉపసంఘం తమను కోరిందని ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నదే తమ డిమాండ్ అన్నారు. ఉపసంఘంతో చర్చలు విఫలమయ్యాయన్నారు. ఈరోజు అర్ధరాత్రి నుండి సమ్మె జరుగుతుందన్నారు. ఆంటోని కమిటీ పరిధి స్పష్టంగా లేదన్నారు.
అంతకుముందు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడారు. సమ్మెతో ప్రజలకు ఇబ్బందులు వస్తాయని, విరమించుకోవాలని తాము ఎపిఎన్జీవోలను కోరామన్నారు. స్వాతంత్ర వేడుకలను బహిష్కరించడం సరికాదని, సమ్మె నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరారు. ఆంటోనీ కమిటీకి సమస్యను నివేదించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
సీమాంధ్ర ఉద్యోగుల సమస్యలను మంత్రివర్గ ఉపసంఘం అర్థం చేసుకుందన్నారు. ప్రతి ఒక్కరికి ఈ దేశంలో సమాన పౌరహక్కు ఉందని, నిరవధిక సమ్మె అనేది ఆఖరి అస్త్రమని, ఆ నిర్ణయం ఇప్పుడే తీసుకోవద్దన్నారు. సమ్మె ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలు ఆగిపోతాయన్నారు.
కాగా అవనిగడ్డ ఉప ఎన్నికకు పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని ఎన్నికల సంఘం అధికారి భన్వర్ లాల్ వేరుగా చెప్పారు. ఉద్యోగులు పోలింగ్ సిబ్బందిని అడ్డుకోవద్దని కోరారు. మరోవైపు విభజనపై అభ్యంతరాలు, విజ్ఞప్తులు ఆంటోనీ కమిటికీ తెలుపాలని పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ చెప్పారు.
ఇంజన్ లేని రైలు: కోదండరామ్
హైదరాబాదులేని తెలంగాణ ఇంజిన్ లేని రైలు వంటిదని తెలంగాణ ఐకాస చైర్మన్ ఆచార్య కోదండరామ్ వేరుగా అన్నారు. కలిసి ఉండటం కుదరదన్నారు. 610 జివో గురించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాదులో జరిగే ర్యాలీలను గుర్తు పెట్టుకోవాలన్నారు. సీమాంధ్రలోని బడుగులు విభజన కోరుకుంటున్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications