చెత్తబుట్టలో వేశారా?: సుజన వాగ్వాదం, హరి మద్దతు

ఇరవై నిమిషాల్లో ప్రసంగం పూర్తి చేయాలని చైర్మన్ కోరగా, తనకు గంట కావాలని సుజన పట్టుబట్టారు. ప్రచారం కోసం తప్ప సమస్య పరిష్కారం కోసం చూడటం లేదంటూ డిప్యూటీ చైర్మన్ సుజన పైన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో సభను మరోసారి వాయిదా వేశారు. ఓ సమయంలో సుజనా చౌదరి మాట్లాడుతుండగా రాజ్యసభ చైర్మన్ అడ్డుకోవడంతో హరికృష్ణ ఎంపికి మద్దతుగా నిలిచారు.
తమ ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం మాత్రమే తాము గత కొన్ని రోజులుగా సభ సమావేశాలకు ఆటంకం కలిగించామని అందుకు క్షంతవ్యులమని ఆయన ప్రసంగం ప్రారంభించారు. కేంద్రం రూ.25 కోట్లు ఖర్చు పెట్టి శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేస్తే, ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టును ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. ఆ కమిటీ ఇచ్చిన ఆరో చాప్టర్‌ను కేంద్రం ఎందుకు బయట పెట్టడం లేదన్నారు. దానిని బయట పెట్టాలన్నారు.
శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు ఇచ్చి రెండున్నర సంవత్సరాలు దాటినా దానిని పట్టించుకోలేదన్నారు. ఆ కమిటీ రిపోర్టును చెత్తబుట్టలో వేశారా అన్నారు. విభజన నిర్ణయం తొందరపాటు చర్య అన్నారు. విభజన అంశాన్ని కాంగ్రెసు పార్టీ ఓటు బ్యాంకు అంశంగా చూస్తోందన్నారు. కాంగ్రెసు తన కప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు అపవిత్ర చర్యలకు పాల్పడటం సరికాదన్నారు. యూపిఏ ముందు ప్రవేశ పెట్టిన డాక్యుమెంట్లను సభలో పెట్టాలని డిమాండ్ చేశారు.
ఆంటోనీ కమిటీ శ్రీకృష్ణ కమిటీకి ప్రత్యామ్నాయమా కాదా చెప్పాలన్నారు. అలాగే ఆ కమిటీ పార్టీదా, అధికారికమైనదా, విభజనపై అది ఫైనల్ సిఫార్సు చేసేదా..? ఇలాంటి వాటి పైన సమాధానం చెప్పాలన్నారు. ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితులు అంతర్యుద్దాన్ని తలపిస్తోందన్నారు. రాజధాని విషయంలో సిడబ్ల్యూసి నిర్ణయం అయోమయంగా ఉందన్నారు. పదేళ్లు ఉమ్మడి రాజధాని విషయంలో చాలామందికి అనుమానాలున్నాయన్నారు. హైదరాబాదు నగరాన్ని కొన్ని దశాబ్దాల పాటు ఎందరో నిర్మించారన్నారు.












Click it and Unblock the Notifications