ఎంత చేసినా, చేయాల్సింది ఇంకా ఎంతో ఉంది: ప్రధాని
న్యూఢిల్లీ: ఎన్ని పథకాలు ప్రారంభించినా చేయాల్సింది ఇంకా ఎంతో ఉందని ప్రధాని డాక్ట్రర్ మన్మోహన్ సింగ్ అన్నారు. 67వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన గురువారం జాతినుద్దేశించి ప్రసంగించారు. గత దశాబ్ద కాలంలో ఎన్నో సంస్కరణలు తెచ్చామని ఆయన చెప్పారు. గత దశాబ్దం దేశానికి ఎంతో మంచి చేసిందని ఆయన అన్నారు. ప్రగతిశీలమైన, ఆధునిక భారత నిర్మాణానికి యుపిఎ ప్రభుత్వం పనిచేసిందని ఆయన అన్నారు.
ఉత్తరాఖండ్ ప్రకృతి వైపరీత్యంలో మరణించినవారికి ఆయన సంతాపం ప్రకటించారు. సహాయక చర్యల్లో సైన్యం కీలక పాత్ర పోషించిందని ఆయన ప్రశంసించారు. బాధితులను ఆదుకునే క్రమంలో అసువులు బాసిన సైనికులకు ఆయన శ్రద్దాంజలి ఘటించారు. గంగానది ఆగ్రహానికి గురైన ఉత్తరాఖండ్‌ను ఆదుకుంటామని చెప్పారు. సింధురక్షక్ ఘటనలో మృతి చెందినవారికి కూడా ఆయన శ్రద్ధాంజలి ఘటించారు.

ఆర్థిక సమస్యలు ప్రారంభించినప్పుడు సమస్యలు ఎదురయ్యాయని, 1991 నుంచి అనేక సమస్యలు ఎదురయ్యాయని, గత దశాబ్ద కాలంలో ఎన్నో సంస్కరణలు తెచ్చామని ఆయన అన్నారు. పేదలు అర్థాకలితో అలమటించకూడదనే తాము ఆహారభద్రతా బిల్లును తెస్తున్నామని, అది పార్లమెంటులో ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నామని ఆయన అన్నారు. పేదరిక నిర్మూలన కోసం నిరంతరం శ్రమిస్తున్నట్లు తెలిపారు. చిరునవ్వుల భారతాన్ని చూడాలన్నదే తమ లక్ష్యమని ఆయన అన్నారు. యువతకు ఉపాధి కల్పించేదుకు ప్రయత్నిస్తున్నామని, యువత అంతటికీ ఉపాధి కల్పించే కల కంటున్నామని ఆయన అన్నారు
పేద విద్యార్థుల కోసం అనేక పథకాలు తెచ్చామని, అందరికీ విద్య నినాదంతో విద్యా హక్కు చట్టం తెచ్చామని ఆయన అన్నారు. ఉన్నత విద్యాభివృద్ధికి ఐఐటిలు, ఎన్ఐటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేశంలో 11 కోట్ల మందికి మధ్యాహ్న భోజన పథకం అందిస్తున్నట్లు తెలిపారు. గత రెండేళ్లలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదని చెప్పారు. ఉపాధి హామీ పథకం ద్వారా నిరంతరం ఉపాధి కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు మెరుగుపరుస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రపంచంతో పోలిస్తే ఆర్థిక మాంద్యం ప్రభావం మనపై తీవ్రంగా ఉందని అన్నారు. వృద్ధి రేటు ఐదు శాతం కన్నా తక్కువగా ఉందని ఆయన అన్నారు. ఐరోపా, అమెరికాల్లో మాద్యం మనల్ని కలచివేసిందని అన్నారు. ఆర్థిక స్థితిని గాడిలో పెట్టేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. చత్తీస్‌గడ్‌లో నక్సల్స్ దాడి ఘటన ప్రజాస్వామ్యానికే ముప్పు అని ఆయన వ్యాఖ్యానించారు. అంతర్గత భద్రత మెరుగుపడిందని ఆయన చెప్పారు.
పాకిస్తాన్ తీరుపై ఆయన తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సరిహద్దు, అంతర్గత భద్రతపై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. పాకిస్తాన్ భూభాగంలో తీవ్రవాద కార్యకలాపాలను నియంత్రించాలని, అప్పుడే పాకిస్తాన్‌తో సంబంధాలు మెరుగుపడుతాయని ఆయన అన్నారు. మన సైనికులపై దాడులు కలచివేశాయని ఆయన అన్నారు. సరిహద్దుల్లో జవాన్లపై దాడుల నియంత్రణకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications