టీపై వెనక్కి తగ్గదన్న బొత్స: సీమాంధ్ర నేతలు ఫైర్

విభజన జరిగిపోయింది కాబట్టి సమస్యలపై దృష్టి పెడితే మంచిదని, సమస్యలను ఆంటోనీ కమిటీకి వివరిస్తే మంచిదని బొత్స సత్యనారాయణ చెప్పారు. దాంతో సీమాంధ్ర ప్రజాప్రతినిధులు సమ్మతించలేదు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఏకవాక్య తీర్మానం చేసి ఆంటోనీ కమిటీకి చెప్పాలని సీమాంధ్ర ప్రజాప్రతినిధులు పట్టుబట్టారు. దీంతో సమావేశం వాడిగావేడిగా సాగింది. ఆంటోనీ కమిటీని కలిసే విషయంపై నిర్ణయం తీసుకోలేదని, దానిపై ఇంకా చర్చించాల్సి ఉందని బండారు సత్యానందరావు మీడియా ప్రతినిధులతో చెప్పారు.
నాయకులు, పార్టీలూ ఎవ్వరూ లేకుండానే ప్రజలు స్వచ్ఛందంగా సమైక్యాంధ్రకోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారని, ఈ పరిస్థితులలో తాము కూడా ప్రత్యక్షంగా ఉద్యమంలోకి దిగదలిచామని వారు ముఖ్యమంత్రికి స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ సమావేశానికి 88 మంది ప్రజా ప్రతినిధులు హాజరైనట్టు తెలుస్తోంది. మంత్రులు బొత్స, కన్నా, అహ్మదుల్లా, కొండ్రు, రామచంద్రయ్య, ఆనం, తోట విశ్వరూప్ ప్రభృతులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
రాష్ట్ర విభజన అంశంపై సిడబ్ల్యుసి తీసుకున్న నిర్ణయాన్ని సీమాంధ్ర ప్రజలు తీవ్రంగా పరిగణిస్తున్నారని, అందరూ కాంగ్రెస్ పార్టీనే ఇందులో దోషిగా చూస్తున్నారని వారు ముఖ్యమంత్రికి చెప్పినట్టు తెలుస్తోంది. ఆంటొనీ కమిటీకి చెప్పదలచింది ఢిల్లీ వెళ్లి చెప్పడం కాదని, ఆ కమిటీనే రాష్ట్రానికి రావలసిందిగా కోరాలని వారు ముఖ్యమంత్రిని అభ్యర్థించినట్టు తెలుస్తున్నది. పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత ఆంటోనీ కమిటీని రాష్ట్రానికి రావాల్సిందిగా కోరాలని వారు సూచించినట్లు తెలుస్తోంది.
తెలంగాణ మంత్రులు, శానససభ్యులు, ఎమ్మెల్సీలు ఆదివారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలతో సమావేశం కానున్నారు. ఆంటోనీ కమిటీ ముందు ఏం చెప్పాలనే విషయంపై వారు చర్చించనున్నారు.












Click it and Unblock the Notifications