హరి దిష్టిబొమ్మ దగ్ధం, జగన్ కోసం ఒప్పందమని టిడిపి

జగన్, రాహుల్ కోసం ఒప్పందం: పయ్యావుల
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్, ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు ఆ పార్టీల మధ్య ఒప్పందం కుదిరిందని టిడిపి నేత పయ్యావుల కేశవ్ శుక్రవారం ఆరోపించారు. కేంద్రమంత్రులు ప్రజల గురించి ఆలోచించాలని ఆయన కోరారు.
సస్పెన్షన్‌లతో అధికార కాంగ్రెసు పార్టీ సీమాంధ్రులను మరింత రెచ్చగొడుతోందన్నారు. విభజన జరగకుముందే హైదరాబాదులో సీమాంధ్రులపై దాడులు జరుగుతుంటే.. మున్ముందు ఎలా ఉంటుందని చెప్పారు. కాంగ్రెసుతో ఆన్‌లైన్‌లో మాట్లాడే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షులు వైయస్ విజయమ్మ తెలుగుదేశం పార్టీని విమర్శించడం విడ్డూరమన్నారు.
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అపాయింటుమెంట్ కోసం బ్రదర్ అనిల్ కుమార్ విదేశీ రాయబారితో ప్రయత్నాలు చేయడం నిజం కాదా అని ప్రశ్నించారు. తాము భవిష్యత్తులో కాంగ్రెసు పార్టీకి మద్దతిచ్చేది లేదని విజయమ్మ ప్రమాణం చేసి చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, సమైక్యాంధ్ర కోసం దీక్ష చేస్తున్న పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు.


Click it and Unblock the Notifications