మద్రాసు లాక్కున్నారు, హైదరాబాద్ దూరం: షర్మిల
తిరుపతి: గతంలో మద్రాసును లాక్కున్నారని, ఇప్పుడు హైదరాబాదును దూరం చేస్తామంటున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు, వైయస్ జగన్ సోదరి వైయస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. తన సమైక్యాంధ్ర శంఖారావం బస్సు యాత్రను ప్రారంభించడానికి ముందు ఆయన సోమవారం సాయంత్రం తిరుపతి బహిరంగ సభలో ప్రసంగించారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలపై ఆమె నిప్పులు చెరిగారు. అన్నదమ్ముల మధ్య అగ్గి పెట్టి కాంగ్రెసు చలి కాచుకుంటోందని ఆమె వ్యాఖ్యానించారు. తెలుగువారి ఓట్లు దండుకుని తెలుగువారిపైనే వేటు వేసిందని ఆమె అన్నారు.
60 ఏళ్లు కలిసికట్టుగా అందరూ హైదరాబాదు కోసం పనిచేశారని, దాంతోనే హైదరాబాద్ ఇంతగా అభివృద్ధి అయిందని, హైదరాబాద్ మనదే అనుకుని కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టి, రక్తం ధారపోసి కష్టిస్తే వెళ్లిపోవాలని అంటున్నారని అన్నారు. లఘుపరిశ్రమలు, భారీ పరిశ్రమలు, ఉద్యోగాలు హైదరాబాదులోనే ఉన్నాయని, వాటిలో మీకు భాగం లేదు వెళ్లిపోవాలని అంటున్నారని, ప్రతి విద్యార్థీ ఉద్యోగం కోసం హైదరాబాద్ వైపు చూస్తాడని, విభజన జరిగితే ఎటు వెళ్లిపోవాలని ఆమె అన్నారు. పదేళ్లలోనే హైదరాబాదులాంటి నగరాన్ని నిర్మించుకోవడం ఎలా సాధ్యమవుతుందని ఆమె అడిగారు.

ఇంగితం ఉందా...
పదేళ్ల పాటు మీ రాజధాని పక్క రాష్ట్రంలో ఉంటుందని చెబుతున్నారని, అలా చెప్పేవారికి ఇంగితం ఉందా అని ఆమె అన్నారు. హైదరాబాదులోని సీమాంధ్రులు రెండో తరగతి పౌరుల్లా పక్క రాష్ట్రం దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బతకాలా, బిక్కుబిక్కుమంటూ జీవించాలా అని ఆమె అడిగారు. ఆస్తులకు రక్షణ ఉందా అని ప్రశ్నించారు. డబ్బంతా రాజధాని కట్టుకోవడానికే వెచ్చిస్తే, అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఎలా అమలవుతాయని ఆమె అడిగారు.
బతకడానికి కావాల్సింది కడుపు నిండ అన్నమా, సీమాంధ్ర ప్రజల రక్తమా అని ఆమె కాంగ్రెసు నాయకులను అడిగారు. తమ ఓట్లతో అధికారంలోకి వచ్చి తమ వేలితోనే తమ కంట్లో పొడుస్తారా అని ప్రజలు అడుగుతున్నారని ఆమె అన్నారు. విభజన పేరుతో కాంగ్రెసు పార్టీ తెలుగువారిని వెన్నుపోటు పొడిచిందని ఆమె విమర్శించారు. విభజన చేస్తే గ్రామాలు స్మశానాలుగా మారిపోవా, దీనికి కాంగ్రెసు సమాధానం చెప్పాలి. వైయస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అయిందని ఆమె వ్యాఖ్యానించారు.
ఆత్మహత్యలు చేసుకోవాలా..
మరో రాష్ట్రం ఏర్పడితే నీళ్లు ఎలా వస్తాయో చెప్పడం లేదని ఆమె అన్నారు. శ్రీకాకుళం నుంచి కప్పం దాకా సముద్రం నీళ్లు తప్ప మంచినీళ్లు ఉండవని అన్నారు. కొత్త రాష్ట్రం వచ్చి నీళ్లను అడ్డుకుంటే సీమాంధ్ర ఎడారి అయిపోదా అని ఆమె అడిగారు. కృష్ణాగోదావరి నదుల నీళ్లు ఇవ్వరట, హైదరాబాద్ ఇవ్వరట, విభజన మాత్రం చేస్తారట, సీమాంధ్ర ప్రజలు ఆత్మహత్య చేసుకోవాలా అని షర్మిల అన్నారు రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని వల్లకాడు చేస్తారా, దీనికి కాంగ్రెసు సమాధానం చెప్పాలని ఆమె అన్నారు
కర్ణాటక, మహారాష్ట్రలకు మనపై ద్వేషం ఏమీ లేదు, అయినా నీళ్లు రావని, సీమాంధ్రపై తెలంగాణ నాయకులకు కోపమూ ద్వేషమూ ఉన్నాయని, సీమాంధ్ర నాయకుల ఆల్సుతల లాక్కుంటామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు అన్నారని, అది నిజం కాదా అని ఆమె అన్నారు. సీమాంధ్రుల ఆస్తులపై దాడులు చేయడం నిజం కాదా అని ప్రశ్నించారు. విభజన జరగకముందే ఇలా ఉంటే విభజన జరిగిన తర్వాత కనీసం మనుషుల్లానైనా చూస్తారా అని అడిగారు.
దానికీ ఓ లెక్క ఉంది..
రాష్ట్ర విభజన జరుగుతుంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉలుకరు, పలుకరని షర్మిల అన్నారు. దానికీ ఓ లెక్క ఉందని, హైదరాబాదు చుట్టూ వేలాది ఎకరాల భూములు చంద్రబాబు అనుచరులు, బినామీల పేర్ల మీద ఉన్నాయని, జగన్ ముఖ్యమంత్రి అయితే తన ఆస్తులకు భద్రత ఉండదని చంద్రబాబు అనుకుంటున్నారని, కాంగ్రెసు అయితే వాటిని రక్షిస్తుందని అనుకుంటున్నారని షర్మిల అన్నారు.
అందుకే చంద్రబాబు తెలంగాణ ఇచ్చేయాలని అన్నారని, హైదరాబాదును బంగారు పల్లెంలో పెట్టి ఇచ్చేయమన్నారని ఆమె విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీని రెండు ప్రాంతాల్లో లేకుండా చేస్తున్నారని చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తూ ఎందుకు గింజుకుంటున్నారని ఆమె అడిగారు. టిడిపి అన్ని రకాలుగా చచ్చిపోయిందంటే చంద్రబాబుకు వ్యక్తిత్వం లేకపోవడం కాదా, ప్రజలు నమ్మకపోవడానికి విశ్వసనీయత లేకపోవడం కాదా అని షర్మిల అడిగారు.
మామను వెన్నుపోటు పొడచాడు
చంద్రబాబు సొంత మామను వెన్నుపోటు పొడచాడని ఆమె ఆరోపించారు. ముఖ్యమంత్రిగా వ్యవసాయాన్న దండుగ చేసి పన్నులు, చార్జీలు పెంచింది చంద్రబాబు కాదా అని అడిగారు. ప్రతిపక్షథ నేత అయి ఉండి పాలకపక్షంతో పాలలో నీళ్లలా కలిసిపోయాడని ఆమె వ్యాఖ్యానించారు. పార్లమెంటు ఎన్నికల నుంచి పంచాయతీ ఎన్నికల వరకు కలిసి పనిచేసింది చంద్రబాబు, కాంగ్రెసు కాదా అని అన్నారు. కాంగ్రెసుతో చంద్రబాబు కుమ్మక్కయ్యారని ఆరోపించారు.
చీకట్లో చిదంబరాన్ని కలిసి తనపై విచారణలు లేకుండా చంద్రబాబు చూసుకున్నాడని ఆమె అన్నారు. దుర్మార్గం పాలనపై అవిశ్వాసం పెడితే చంద్రబాబు కాంగ్రెసు ప్రభుత్వం మీద ఈగ కూడా వాలడానికి వీలు లేదని విప్ జారీ చేశారని ఆమె అన్నారు. కాంగ్రెసును భుజాన మోస్తోంది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు.
బ్లాంక్ చెక్‌లా తెలంగాణను ఇచ్చారు
తెలంగాణను బ్లాంక్ చెక్కులా రాసి కేంద్రానికి లేఖ ఇచ్చారని షర్మిల అన్నారు పదే పదే తెలంగాణ ఇచ్చేయండని చెప్పింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని 60 శాతం మంది ప్రజలకు అన్యాయం జరుగుతుంటే వారి తరఫున నిలబడాలి కానీ చంద్రబాబు మాట్లాడడం లేదని అన్నారు. నాలుగు లక్షల కోట్లకు హైదరాబాదును అమ్మకానికి పెట్టింది చంద్రబాబు కాదా అని అడిగారు. ఇంతకన్నా ద్రోహం ఉంటుందా అని ప్రశ్నించారు.
పట్టపగలే సీమాంధ్ర ప్రజల గొంతు కోసి, ఏ మొహం పెట్టుకుని సీమాంధ్రలో చంద్రబాబు అడుగుపెడుతున్నారని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు రాజీనామా ఎందుకు చేయడం లేదని, తన ప్రజాప్రతినిధులతో ఎందుకు రాజీనామా చేయించడం లేదని ఆమె అడిగారు.
చేసిందంతా చేసి వైయస్‌పై నిందలు
రాష్ట్ర విభజన విషయంలో చేసిందంతా చేసి వైయస్ వల్లనే విభజన జరుగుతోందని చంద్రబాబు అంటున్నారని ఆమె అన్నారు. వైయస్ బతికి ఉంటే రాష్ట్రానికి ఈ గతి పట్టి ఉండేది కాదని షర్మిల అన్నారు. ప్రధానే స్వయంగా ఆ మాట అన్నారని గుర్తు చేశారు. చంద్రబాబుకు మనసాక్షి ఉందా ఓసారి పరిశీలించుకోవాలని ఆమె అన్నారు. చంద్రబాబుకు ఆత్మంటూ ఒక్కటి ఉందా అని అన్నారు. ఎపిఎన్జీవోలు అడిగితే తెలంగాణకు కట్టుబడి ఉన్నానని చెప్పి పంపించింది చంద్రబాబు కాదా అని అడిగారు.
వెన్నుపోటు పొడిచినందుకు చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోరా అని షర్మిల అడిగారు. చంద్రబాబులో ఏమైనా మార్పు వచ్చిందా, ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆమె అన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం కలిసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాయని ఆమె విమర్శించారు. ఐదు పార్టీలు తెలంగాణకు అంగీకరిస్తే, మూడు పార్టీలు వైయస్సార్ కాంగ్రెసు, మజ్లీస్, సిపిఎం అంగీకరించలేదని చెబుతూ అది ఏకాభిప్రాయం ఎలా అవుతుందని ప్రశ్నించారు. తండ్రిలాగా న్యాయం చేయాలనే మాట మాత్రమే తమ పార్టీ చెప్పిందని ఆమె గుర్తు చేశారు. అందరినీ పిలిచి చర్చలు జరపాలని కోరిందని అన్నారు.
సమన్యాయం చేయకపోతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆమె డిమాండ్ చేశారు. తమ డిమాండ్ సాధన కోసం చివరి వరకూ పోరాటం చేస్తామని అన్నారు. సీమాంధ్రకు చెందిన తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు రాజీనామాలు చేసి ఉంటే విభజన నిర్ణయం ఆగిపోయి ఉండేదని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications