బిడ్డకు మూడేళ్లు వచ్చినా.. తల్లి, తండ్రి చెప్పలేని పరిస్థితి, సీపీఐ నారాయణ సెటైర్స్
ఏపీ రాజధానిపై దుమారం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం మూడు రాజధానులు అంటుండగా.. అమరావతే రాజధాని అని టీడీపీ అంటోంది. అయితే ఇదే అంశంపై సీపీఐ నారాయణ మాట్లాడారు. ఏపీ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. రాజధాని విషయంలో జరుగుతున్న గందరగోళానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన అన్నారు.
విజయవాడలో సీపీఐ జాతీయ మహాసభలు జరుగుతున్నాయి. సీపీఐ నారాయణ ,సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. రాజధాని అమరావతి అని చంద్రబాబు ప్రకటిస్తే, ఆ నాడు జగన్ ఆమోదం తెలిపారని సీపీఐ నారాయణ గుర్తుచేశారు. ఇప్పుడు జగన్ మాట మార్చి మడమ తిప్పారని విమర్శించారు.

రాజధాని ఏదంటే చెప్పలేని స్థితిలో ఏపీ ప్రజలు ఉన్నారని నారాయణ వెల్లడించారు. బిడ్డకు మూడేళ్లు వచ్చినా, తల్లి, తండ్రి ఎవరో చెప్పలేని పరిస్థితి అంటూ ఫైరయ్యారు. మూడు రాజధానుల ఉద్యమానికి ప్రభుత్వమే స్పాన్సర్ అని కామెంట్ చేశారు. విశాఖపట్టణంలో భూ కుంభకోణాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
తర్వాత సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన కొనసాగుతోందని అన్నారు. ప్రతిపక్ష పార్టీలను చూస్తే సీఎం జగన్ ఎందుకంత భయం అని ప్రశ్నించారు. మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని విమర్శించారు. వైసీపీ విశాఖ గర్జన పూర్తిగా విఫలమైందని ఫైరయ్యారు. వైసీపీ నేతలు ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications