జనవాణికి విశేష స్పందన.. పవన్‌కు వినతి పత్రాల అందజేత
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు జనసేన జనవాణి అనే కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. జనవాణి కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. బాధితులు భారీగా వచ్చారని జనసేన నేతలు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల నుంచి వినతి పత్రాలను తీసుకున్నారు.
కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం సహా వివిధ జిల్లాల నుంచి బాధితులు తరలివచ్చారు. వ్యక్తిగత, సామాజిక సమస్యలు, వారి ప్రాంతాల్లో మౌలిక వసతుల సమస్యలను పవన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇప్పటివరకు 400కు పైగా బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. పవన్ స్వీకరించిన ఫిర్యాదుల సమాచారాన్ని జనసేన సిబ్బంది కంప్యూటర్‌లో నమోదు చేసుకుంటున్నారు.వినతులు, ఫిర్యాదులు అందించిన బాధితులకు జనసేన సిబ్బంది రసీదు అందజేశారు. ఫిర్యాదులను సంబంధిత ప్రభుత్వ విభాగాలకు పంపి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నారు.

పాలకులు హామీలను ఇవ్వడమే తప్ప ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజల ఓట్లతో గద్దెనెక్కిన ప్రజాప్రతినిధులే సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలిచి సమస్యలు పరిష్కంచాలన్న ఉద్దేశంతోనే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించామని స్పష్టం చేశారు.
సీఎం నివాసం వద్ద భద్రత పేరుతో ఇల్లు ఖాళీ చేయించారని ఓ మహిళ తనను కలిసిందని చెప్పారు. అధికార పార్టీ నేతలు ఆ కుటుంబాన్ని వేధించారు. వాళ్ల సోదరుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. కూరగాయల కోసం వెళ్లిన ఓ వ్యక్తి శవమయ్యాడు. ఆ మరణానికి ఇప్పటికీ కారణం దొరకలేదు. ఇలా ఎంతోమంది కుటుంబపరంగా, సామాజికంగా, రాజకీయంగా సమస్యలు సమస్యలు ఎదుర్కొంటున్నా తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎదురుచూపులు చూస్తున్నారు. అందుకే ప్రజల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వానికి నివేదించడానికే జనవాణి కార్యక్రమాన్ని ప్రారంభించాం. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని పవన్ తెలిపారు.












Click it and Unblock the Notifications