తాడిపత్రిలో ఉద్రిక్తత.. జేసీ ప్రభాకర్ రెడ్డి హౌస్ అరెస్ట్
అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో భారీగా పోలీసులను మొహరించారు. పెద్దపప్పూరు వద్ద పెన్నా నదిలో అక్రమంగా ఇసుక, మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగా తవ్వకాలను అడ్డుకుంటామని, వాటిని సరఫరా చేసే వాహనాలను తగలబెడతామని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు.
ఈ నేపథ్యంలో జేసీ ఇంటి వద్ద సుమారు 100 మంది పోలీసులను మొహరింప చేయడమే కాకుండా ఇంటి చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఆయన ఇంటికి వచ్చిన 8 మంది టీడీపీ నాయకులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం జేసీ ని గృహనిర్బంధం చేశారు. బయటకు వచ్చిన ఆయన్ను తిరిగి ఇంట్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేయగా నేలపై పడిపోయారు. దీన్ని ఖండిస్తూ జేసీ తన ఇంటిముందే కుర్చీలో కూర్చొని తీవ్ర నిరసన తెలియజేశారు.

కుర్చీతో సహా జేసీని లోపలికి తీసుకువెళ్లేందుకు పోలీసులు ప్రయత్నించగా దీన్ని పార్టీ నాయకులు ఖండించారు. పెద్ద పప్పూరు పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునివ్వగా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రకటనవల్ల జేసీ అడ్డుకుంటున్నామని పోలీసులు చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో తాడిపత్రి నియోజకవర్గం నుంచి తన కుమారుడు అస్మిత్ రెడ్డిని బరిలోకి దింపేందుకు ప్రభాకర్ రెడ్డి ఇప్పటినుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. తమ కుటుంబానికి కంచుకోట లాంటి తాడిపత్రిలో గత ఎన్నికల్లో ఓటమిపాలవడానికి గల కారణాలను విశ్లేషించుకొని ఈసారి అటువంటివి పునరావృతం కాకుండా కుమారుడిని అసెంబ్లీకి పంపించాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ గా విజయం సాధించారు.












Click it and Unblock the Notifications