ఏపీలో కొత్తగా స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు: జిల్లాలవారీగా కొత్త కేసులివే, 13 మంది మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. అయితే, తాజాగా, 2వేల దిగువనే కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 70,757 నమూనాలను పరీక్షించగా.. 1859 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 1859 కరోనా కేసులు, 13 మంది మృతి
తాజాగా నమోదైన 1859 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,88,910కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 13 మంది మృతి చెందారు.
అత్యధికంగా చిత్తూరు జిల్లాలో నలుగురు మరణించగా, కృష్ణా జిల్లాలో ముగ్గురు, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 13,595 మృతి చెందారు.

ఏపీలో 18,688 యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 1575 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 19,56,627కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం 18,688 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,54,53,520 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా పశ్చిమగోదావరి జిల్లాలో 402 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అల్పంగా కర్నూలు జిల్లాలో 19 మంది కరోనా బారినపడ్డారు. మరోవైపు, కరోనా నిర్ధారణలో అత్యధిక కచ్చితత్వం ఆర్టీపీసీఆర్ (రివర్స్ ట్రాన్స్‌క్రిప్షన్ పాలిమరైజ్ చైన్ రియాక్షన్) టెస్టులు చేయడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంది. దేశంలో ఎక్కువ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌కు రెండోస్థానం దక్కింది. ఖర్చు ఎక్కువైనా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీపీసీఆర్ టెస్టులకే అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఆగస్టు 10వ తేదీ వరకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన మొత్తం ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో తమిళనాడు తర్వాత అత్యధిక టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఏపీనే. కాగా, తమిళనాడులో 99 శాతం టెస్టులు ఆర్టీపీసీఆర్ పద్ధతిలో జరుగుతుండగా.. ఏపీలో 97 శాతం ఆర్టీపీసీఆర్ టెస్టులు జరుగుతున్నట్టు వెల్లడైంది. కేరళ వంటి రాష్ట్రాలు సైతం నేటికీ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టుల పైనే ఆధారపడుతున్నాయి. మన రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి చెందే నాటికి ఒక్క వైరాలజీ ల్యాబొరేటరీ కూడా లేదు. అలాంటిది 13 జిల్లాల్లో 14 వైరాలజీ ల్యాబొరేటరీలు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయడం వల్లే పెద్ద సంఖ్యలో ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయగలుగుతున్నారు.

ఏపీలో జిల్లాల వారీగా కరోనావైరస్ కొత్త కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 40, చిత్తూరులో 233, తూర్పుగోదావరిలో 402, గుంటూరులో 182, కడపలో 148, కృష్ణాలో 144, కర్నూలులో 19, నెల్లూరులో 225, ప్రకాశంలో 96, శ్రీకాకుళంలో 28, విశాఖపట్నంలో 123, విజయనగరంలో 24, పశ్చిమగోదావరిలో 195 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,81,786, చిత్తూరులో 2,34,431 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(81,731) కరోనా కేసులున్నాయి. ఇది ఇలావుండగా, దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లోనూ రోజువారీ కరోనా కేసులు పెరగడం టెన్షన్ పెడుతోంది. గత 24 గంటల్లో 41,195 కొత్త కేసులు నమోదు చేసిన భారతదేశం అంతకు ముందు రోజుతో పోలిస్తే 7.4 శాతం కేసుల పెరుగుదల చూసింది. ప్రస్తుతం నమోదైన తాజా కేసులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న కరోనా కేసుల సంఖ్య ఇప్పుడు 3.20 కోట్లకు చేరింది. మొత్తం మరణాలు 4.29 లక్షలకు పెరిగాయని ప్రభుత్వం తెలిపింది. గత 24 గంటల్లో కరోనా మహమ్మారి బారిన పడిన వారు 490 మంది మరణించారు. ప్రస్తుతం భారతదేశంలో 3,87,987 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా నిర్ధారణ కోసం చేసిన పరీక్షలు 48,73,70,196 కు చేరుకున్నాయి. దేశంలోని రోజువారీ కేసులలో కేరళ రాష్ట్రం నుంచి అత్యధికంగా కేసులు నమోదు అవుతుండటం గమనార్హం. గత 24 గంటల్లో కేరళ 23,500 కేసులను నమోదు చేసింది. దేశంలో కొత్త ఇన్ఫెక్షన్లలో 50 శాతానికి పైగా దక్షిణాది రాష్ట్రం నుండే నమోదవుతున్న పరిస్థితి ఉంది.

ఏపీలో ఆంక్షలు కొనసాగుతాయా?
ఆంధ్రప్రదేశ్‌లో రోజువారీ కరోనా కేసులు ప్రస్తుతం 2వేలకు దిగువనే నమోదవుతున్నాయి. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలు జరుగుతోంది. ఆగస్ట్ 14 వ తేదీతో నైట్‌కర్ఫ్యూ పూర్తవుతుంది. 14 తరువాత కర్ఫ్యూను పొడిగించే ఆలోచనలే ఏపీ ప్రభుత్వం లేనట్టుగా కనిపిస్తోంది. ఆగస్టు 16 వ తేదీ నుంచి పాఠశాలలు, కాలేజీలు తిరిగి ప్రారంభించబోతున్నారు. స్కూళ్లు తిరిగి ప్రారంభిస్తే నైట్ కర్ఫ్యూ అమలు చేయడం కుదరనిపని. ఇకవేళ పూర్తిగా కర్ఫ్యూ ఎత్తివేయడం వలన ఇబ్బందులు కూడా రావొచ్చు. నైట్ కర్ఫ్యూని ప్రణాళికా బద్ధంగా, కఠినంగా అమలు చేయడం వలన కేసులు కంట్రోల్‌లో ఉన్నాయి. కర్ఫ్యూ పూర్తిగా ఎత్తివేస్తే అనవసరమైన ప్రయాణాలు మొదలయ్యే అవకాశం లేకపోలేదు. ఫలితంగా కేసులు పెరిగే అవకాశం ఉంది. మరి ఆంక్షలు పూర్తిగా ఎత్తివేస్తారా లేదంటే ఏదైనా ప్రత్యామ్నాయం ఆలోచిస్తారా అన్నది ఈ రెండ్రోజుల్లో తేలనుంది.












Click it and Unblock the Notifications