ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు... కొత్తగా 1005 పాజిటివ్ కేసులు నమోదు... ఇద్దరు మృతి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కొత్త కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో కొత్తగా 1005 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు కరోనాతో మృతి చెందారు.
తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,98,815కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 7205కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5394 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఆదివారం(మార్చి 28) విడుదల చేసిన బులెటిన్‌లో వివరాలు వెల్లడించింది.
తాజాగా మరో 324 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటివరకూ కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయినవారి సంఖ్య 8,86,216కి చేరింది. గడిచిన 24గంటల్లో మొత్తం 31,142 శాంపిల్స్‌ను పరీక్షించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 149,90,039కు చేరింది. రాష్ట్రంలో కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 7205కి చేరింది. కొత్తగా నమోదైన మరణాల్లో చిత్తూరు,కృష్ణా జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు.

కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 225 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరిలో ఇప్పటివరకూ 1,25,253 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా మళ్లీ విజృంభిస్తుండటంతో నిబంధనలు పాటించనివారి పట్ల పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నారు.మాస్కులు లేకుండా తిరుగుతున్నవారికి జరిమానా విధిస్తున్నారు. మాస్కు లేకుండా మొదటిసారి పట్టుబడితే రూ.250, రెండోసారి పట్టుబడితే రూ.500 తప్పదని హెచ్చరిస్తున్నారు.