సినీ టీంతో తేల్చేసిన సీఎం జగన్ : ఎవరి సినిమాకైనా ఒకే రేటు - 20 శాతం షూటింగ్ ఏపీలో జరగాలి..!!
సినీ సమస్యల పరిష్కారం కోసం సమావేశమైన చిరంజీవి బృందం తో భేటీ లో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. మంచి పాలసీ తీసుకురావాలని, తద్వారా పెద్ద సినిమాలకు, చిన్న సినిమాలకు న్యాయం జరగాలని గత కొద్ది కాలంగా కసరత్తు జరుగుతుందన్నారు. ఇందులో భాగంగానే అందరి అభ్యర్ధనలను పరిగణలోకి తీసుకుంటూ... దీనిపై ఒక కమిటీని కూడా నియమించామని సీఎం చెప్పారు. ఆ కమిటీ కూడా తరచూ సమావేశమవుతూ వాళ్లకొచ్చిన ఫీడ్ బ్యాక్ కూడా తనతో పంచుకున్నారని వివరించారు. ఇంకా విస్తృతంగా తెలుసుకునేందుకు మిమ్నల్ని కూడా రమ్మని చెప్పామని చెప్పుకొచ్చారు.
Recommended Video

ఏ సినిమాకైనా..ఎవరి సినిమాకైనా ఒకే రేటు
సినిమా పరిశ్రమలో ఉన్న కొన్ని కొన్ని లోపాలను పూర్తిగా సరిదిద్దుకుని.. ఇండస్ట్రీ నిలబడ్డానికి ఒక మంచి వ్యవస్ధను క్రియేట్ చేసుకునేందుకు తపన, తాపత్రయంతోనే అడుగులు పడ్డాయన్నారు. ఏ సినిమాకైనా, ఎవరి సినిమాకైనా ఒకే రేటు ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు. మంచి ధరలు తీసుకురావడం జరిగిందని సీఎం సంకేతాలిచ్చారు. ఇవి ఎవరికైనా కూడా మంచి రేట్లే... అందరికీ న్యాయం జరిగేలా మంచి ధరలు తీసుకొచ్చే ప్రయత్నం చేశామని సీఎం చెప్పారు. హీరో -హీరోయిన్ -దర్శకుడు పారితోషం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోకుండానే నిర్మాణ వ్యయం పరంగా కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ తరహా సినిమాలు చేయడంలో రాజమౌళి నిపుణుడని చెప్పారు. అటువంటి వాటిని ప్రత్యేకంగా చూడాలన్నారు.

ఏపీలో 20 శాతం షూటింగ్ లు జరగాలి
అలా ప్రత్యేకంగా చూడకపోతే భారీ టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఖర్చుతో చేయడానికి ఎవరూ ముందుకురారని పేర్కొన్నారు. హీరో, హీరోయిన్, డైరెక్టర్ రెమ్యునరేషన్ కాకుండా, వీటిని పక్కన పెట్టి కేవలం సినిమా కోసమే రూ.100 కోట్లు కంటే ఎక్కువ ఖర్చు అయిన భారీ బడ్జెట్ సినిమాలును ప్రత్యేకంగా ట్రీట్ చేయాలని అభిప్రాయపడ్డారు. అటువంటి వాటికి వారం రోజుల పాటు కచ్చితంగా ప్రత్యేక ధరలు నోటిఫై చేసే విధంగా ట్రీట్ చేయాలని చెప్పామని సీఎం వెల్లడించారు. ఇక్కడ కూడా రాష్ట్రంలో షూటింగ్‌లు ప్రమోట్ చేయడం కోసం కొంత పర్సెంటేజ్ కేటాయించామన్నారు. ఏపీలో సినిమా షూటింగ్‌లు ప్రమోట్ చేయడం కోసం... ఇక్కడ షూటింగ్‌లు జరిపి ఉండాలి అన్న నిబంధనను తీసుకురాగలిగితే ఇక్కడ కూడా షూటింగ్‌లు పెరుగుతాయని చెప్పారు. కనీసం ఎంత శాతం షూటింగ్ ఆంధ్రప్రదేశ్‌లో చేయాలన్న దానిపై ఇప్పటికే మంత్రి పేర్ని నాని దర్శకులు, నిర్మాతలతో మాట్లాడారు. వారందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని నాతో కనీసం 20 శాతం పెడతాము అని చెప్పారని సీఎం వెల్లడించారు.

అయిదో షోకు అనుమతి ఇస్తాం
రేట్లకు సంబంధించినంత వరకు... అందరికీ ఒకటే రేట్లని సీఎం తేల్చి చెప్పారు. ఆన్ లైన్ పద్ధతిలో టిక్కెట్లు విక్రయం ప్రభుత్వానికి మంచిది, సినిమా ప్రొడ్యూసర్లకు కూడా మంచిది అన్న కోణంలో చూశామని వివరించారు. ఓటీటీలతో పోటీపడాల్సిన పరిస్థితిలో సమతుల్యత కూడా ఉండాలని చర్చించామన్నారు. ఏడాదికి వేయిరూపాయలతో అమెజాన్ ఇస్తుంది. ..నెలకు సగటున రూ.80లు పడుతుంది...దీన్నికూడా దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ఆలాగే కనీస ఆదాయాలు రాకపోతే సినిమాలు తీసే పరిస్థితి కూడా తగ్గిపోతుంది... దాన్ని కూడా సమతుల్యం చేసుకుని సినిమాలు తీసే పరిస్థితి ఎలా అన్న ఆలోచనతో రీజనబుల్‌రేట్లు దిశగా వెళ్లామన్నారు. సినిమా చూసే ప్రేక్షకులకు భారంకాకుండా, ఆ రేట్లు సినిమా పరిశ్రమను పెంపొందించేలా ఉండేలా రేట్లను మాడిఫై చేశామని వివరించారు. ఐదో షోను తీసుకురావాలని అడిగారు. సినిమా శుక్రవారం, శనివారం, ఆదివారం.. ఆ తర్వాత వారం ఆడగలిగితే సూపర్‌హిట్ అవుతుందని.. అదే సమయంలో అది అందరికీ వర్తిస్తుందని చెప్పారు.

విశాఖలో స్థలాలిస్తాం - స్టూడియోలు చేపట్టండి
చిన్న సినిమాలకు అవే రేట్లు వర్తిస్తాయన్నారు. నెమ్మదిగా సినీపరిశ్రమకూడా విశాఖపట్నం రావాలి...అందరికీ విశాఖపట్నంలో స్థలాలు ఇస్తానని ప్రకటించారు. తెలంగాణాతో పోలిస్తే ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆంధ్రా ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తోందని..తెలంగాణా 35 నుంచి 40 శాతం కంట్రిబ్యూట్ చేస్తోంది. ఆంధ్రా 60 శాతం వరకు కంట్రిబ్యూట్ చేస్తోందని లెక్కలు చెప్పారు. స్టూడియోలు పెట్టేందుకు ఆశక్తి చూపిస్తే వాళ్లకు కూడా విశాఖలో స్థలాలు ఇస్తామన్నారు. చైన్నె, బెంగుళూరు, హైదరాబాద్‌లతో విశాఖపట్నం పోటీపడగలదన్నారు. మనం ఓన్ చేసుకోవాలి..మనందరం అక్కడకి వెళ్లాలని స్పష్టం చేసారు. రాజమౌళి మంచి సినిమాలు, పెద్ద సినిమాలు తీయాలి. చిన్న సినిమాలను కూడా రక్షించుకోవాలి. ఈ విషయంలో కలిసి పనిచేద్దాం. వాళ్లు కూడా పరిశ్రమలో భాగమే..వాళ్లనూ భాగస్వామ్యులు చేయాలని సీఎం జగన్ సూచించారు.












Click it and Unblock the Notifications