వెలిగొండ సొరంగాల్లో చిక్కుకున్న 200 మంది కార్మికులు.. ఇప్పుడు ఎలా ఉన్నారంటే ?
ప్రకాశం జిల్లాలోని పెద్దడోర్నాల మండలం కొత్తూరు సమీపంలోని వెలిగొండ ప్రాజెక్టు సొరంగాల్లో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రాజెక్టు రెండో సొరంగంలో లైనింగ్ పనులు చేస్తున్న సుమారు 200 మంది కార్మికులు ఆకస్మిక వరదలో చిక్కుకున్నారు. అదృష్టవశాత్తూ అధికారులు సకాలంలో స్పందించి వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
కాగా వెలిగొండ ప్రాజెక్టు రెండో సొరంగంలో సుమారు 7 కిలోమీటర్ల దూరంలో లైనింగ్ పనులు జరుగుతున్నాయి. అయితే బుధవారం మధ్యాహ్నం వరకు అన్నీ సవ్యంగానే సాగుతుండగా.. తుఫాను కారణంగా ఆకస్మికంగా సమీప వాగుల నుంచి భారీ వరద నీరు సొరంగంలోకి దూసుకువచ్చింది. కొద్ది నిమిషాల్లోనే నీటి మట్టం వేగంగా పెరగడంతో కార్మికులు బయటకు వచ్చే మార్గం లేక చిక్కుకుపోయారు.

ఈ క్రమంలోనే సమాచారం మేరకు వెంటనే ప్రాజెక్టు అధికారులు, స్థానిక పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకొని రక్షణ చర్యలు చేపట్టి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ముందుగా వారిని కృష్ణా నది సమీపంలోని కొల్లం వాగు వద్దకు తరలించగా.. అక్కడి నుంచి బోట్ల ద్వారా శ్రీశైలానికి పంపే ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.
మరోవైపు కార్మికులు సొరంగంలో చిక్కుకుపోయారనే వార్తతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే అధికారులు సమయానికి స్పందించి అందరినీ క్షేమంగా రక్షించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎవరికి ఎలాంటి గాయాలు కానీ, ప్రాణనష్టం కానీ జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.
వెలిగొండ ప్రాజెక్టు అనేది ప్రకాశం, కర్నూలు, నెల్లూరు జిల్లాల ప్రజలకు జీవనాధారం అయిన పథకం. కృష్ణా నది నుంచి నీటిని సొరంగాల ద్వారా ఈ ప్రాంతాలకు తరలించే భారీ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ ఇది. ప్రస్తుతం రెండో సొరంగంలో లైనింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ సొరంగం ద్వారా రోజుకు లక్షల లీటర్ల నీరు తరలించే సామర్థ్యం ఉంది. ఈ ఘటన తర్వాత ప్రాజెక్టు అధికారులు సొరంగాల వద్ద భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు.
వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ముందుగానే రక్షణ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ప్రాజెక్టు పరిధిలోని పనులు తాత్కాలికంగా నిలిపివేయాలన్న ప్రతిపాదనపై కూడా చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications