‘జగనన్న విద్యా కానుక’ ప్రారంభించనున్న జగన్: 43 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 'జగనన్న విద్యా కానుక'ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ప్రారంభించనున్నారు. కృష్ణా జిల్లాలోని పునాదిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అక్టోబర్ 8న సీఎం చేతుల మీదుగా విద్యా కానుక పథకం ప్రారంభం కానుందని విద్యా శాఖ సంచాలకులు వాడ్రేపు చినవీరభద్రుడు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

గురువారం ఉదయమే పునాదిపాడుకు సీఎం జగన్
గురువారం ఉదయం 10.20 గంటలకు సీఎం జగన్ కంకిపాడు మండలం పునాదిపాడుకు చేరుకుంటారు. అనంతరం అక్కడ జిల్లా పరిషత్ హైస్కూల్‌లో నాడు-నేడు పనులను పరిశీలించి, విద్యార్థులతో ముచ్చటిస్తారు. ఆ తర్వాత జగనన్న విద్యా కానుక కిట్లను విద్యార్థులకు అందజేస్తారు సీఎం.

జగనన్న విద్యా కానుకలో ఏముంటాయంటే..?
ఈ జగనన్న కిట్లలో స్కూల్ బ్యాగ్ తోపాటు మూడు జతల యూనిఫామ్స్, 1 జత షూ, 2 జతల సాక్సులు, బెల్ట్, పాఠశాల పుస్తకాలు, నోట్ పుస్తకాలు ఉంటాయి. దేశంలోఏ రాస్ట్రంలోని లేని విధంగా తొలిసారి ఏపీ ప్రభుత్వం వర్క్ బుక్స్ కూడా అందజేయడం గమనార్హం. అంతేగాక, యూనిఫాం కుట్టు కూలీ కూడా తల్లుల అకౌంట్లో జమ చేయనున్నారు. విద్యా కానుక ద్వారా సీఎం జగన్ విద్యా రంగంలో చారిత్రక మార్పులకు శ్రీకారం చుట్టారని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రశంసించారు.

సుమారు 43 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి..
విద్యా కానుక కోసం ఏపీ సర్కారు సుమారు రూ. 650 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 42,34,322 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. 1 నుంచి ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు మూడు జతల యూనిఫామ్స్, 1 జత షూ, 2 జతల సాక్సులు, బెల్ట్, పాఠశాల పుస్తకాలు, వర్క్ బుక్స్, 6-10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు నోట్ పుస్తకాలు, బ్యాగు ఇవ్వనున్నారు. కరోనా నిబంధనలను పాటిస్తూ ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.

ఏ సమస్య ఉన్నా..
గురుకుల పాఠశాలల్లో, కేజీబీవీలలో, వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థులకు చెందిన కిట్లు ఇప్పటికే ఆయా పాఠశాలలకు చేరాయని పాఠశాల విద్య సంచాలకులు తెలిపారు. జగనన్న విద్యా కానుక విషయంలో ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే పాఠశాల ప్రధానోపాధ్యాయులు లేదా మండల విద్యా శాఖాధికారిని సంప్రదించాలని కోరారు. కిట్ తీసుకునేటప్పుడు విద్యార్థి బయోమెట్రిక్, ఐరిష్ హాజరుకు సహకరించాలని కోరారు. ‘జగనన్న విద్యా కానుక'కు సంబంధించి ఏదైనా సమస్యలు ఎదురైతే 91212 96051, 91212 96052 హెల్ప్ లైన్ నంబర్లను పని దినాలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటలలోపు సంప్రదించాలని కోరారు.












Click it and Unblock the Notifications