విజయవాడకు రైల్వే డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్.. త్వరలోనే గ్రీన్ సిగ్నల్
భారతదేశ రవాణా ముఖచిత్రాన్ని మార్చడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇటార్సీ విజయవాడ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ప్రాజెక్ట్ కీలక దశకు చేరుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇటార్సీ నుండి తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ వరకు సుమారు 922 కిలోమీటర్ల పొడవున నిర్మించడానికి తలపెట్టిన ఈ ప్రత్యేక మార్గం యొక్క డీపిఆర్ ను రైల్వే బోర్డు కు సమర్పించారు.
త్వరలో ఇటార్సీ విజయవాడ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ప్రాజెక్ట్ పై కీలక ప్రకటన
ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్ లో ఈ ప్రాజెక్టు నిధుల కేటాయింపు పైన ప్రభుత్వం కీలక ప్రకటన చేయవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో పెరిగిన రవాణా అవసరాల దృష్ట్యా రైల్వే నెట్వర్క్ ను విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రయాణికుల రైళ్ళు, గూడ్స్ రైళ్ళు ఓకే ట్రాక్ పైన నడుస్తున్న క్రమంలో రైల్వే నెట్వర్క్ పై తీవ్రమైన ఒత్తిడి కనిపిస్తుంది. ఇది మన దేశ వ్యాప్తంగా సరుకు రవాణా ఆలస్యం కావడానికి, అధిక ఖర్చుకు కారణమవుతుంది.

తెలంగాణా నుండి ఏపీకి మార్గం
ఈ నేపథ్యంలోనే ఇటార్సీ, విజయవాడ కారిడార్ సరుకు రవాణా చేసే గూడ్స్ రైళ్లకు ప్రత్యేక మార్గాలను అందిస్తోంది. దీనివల్ల రవాణా సమయం కూడా ఆదా అవుతుంది. ఇది లాజిస్టిక్స్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు కూడా వేదిక అవుతుంది. ఇక ఈ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రం నుంచి ఏపీ వరకు సాగుతుంది. దీనివల్ల సిర్పూర్ కాగజ్ నగర్, మంచిర్యాల, రామగుండం, కాజీపేట, ఖమ్మం వంటి ప్రాంతాలకు రవాణా మరింత మెరుగుపడుతుంది.
రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి, కొత్త ఉపాధి అవకాశాలకు తోడ్పాటు
సింగరేణి బొగ్గు, రామగుండం ఎరువుల కర్మాగారాలు వంటి పారిశ్రామిక క్లస్టర్ల ఉత్పత్తులను దేశవ్యాప్తంగా తక్కువ ఖర్చుతో, వేగంగా తరలించడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల రహదారుల పైన ట్రక్కుల రద్దీ తగ్గుతుంది. పొల్యూషన్ తగ్గుతుంది. గ్రీన్ లాజిస్టిక్స్ సాధ్యం అవుతుంది. ఇది రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి, కొత్త ఉపాధి అవకాశాలకు తోడ్పడుతుంది.అత్యంత ఆధునికంగా నిర్మించ తలపెట్టిన ఈ కారిడార్ ఎల్లప్పుడూ, అత్యాధునిక డిజిటల్ సిస్టంతో ఏర్పాటు చేయడానికి రైల్వే సిద్ధమవుతుంది.
భూసేకరణ అప్పటి నుండే
భారీ వ్యాగన్ లతో కూడిన గూడ్స్ రైళ్లను తట్టుకునేలా, ఇది రైళ్ల కదలికలను రియల్ టైం లో పర్యవేక్షిస్తూ ప్రమాదాలను నివారిస్తుంది. ఈ డీపీఆర్ కు రైల్వే బోర్డు ఆమోదం లభించిన తర్వాత కేంద్ర క్యాబినెట్ ఆమోదించనుంది. ఆపైన భూసేకరణ ప్రక్రియ మొదలవుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే భారత ఆర్థిక వ్యవస్థలో సరుకు రవాణా రంగం వేగవంతమైన వృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయం ఉంది.












Click it and Unblock the Notifications