2కోట్ల విలువైన వజ్రం దొరికింది.. కర్నూలుజిల్లా రైతు పంట పండింది; ఆపై జనాలేం చేశారంటే!!
తొలకరి జల్లులు కురిస్తే రాయలసీమ రైతులు ఏరువాకా సాగాలని భావిస్తారని అనుకుంటే తప్పులో కాలేసినట్టే. తొలకరి వర్షాలు కురిస్తే చాలు రాయలసీమ జిల్లాలైన కర్నూలు, అనంతపురం జిల్లాలలో ప్రజలు వజ్రాల కోసం వేట మొదలు పెడతారు. అదృష్టలక్ష్మి వజ్రాల రూపంలో తలుపు తడుతుందేమో అని ఆశగా వెదుకుతుంటారు.
ఎవరో నక్క తోక తొక్కిన వారికి వజ్రాలు అదృష్టాన్ని తెచ్చి పెడతాయి. వారి దరిద్రం పోయి లక్షాధికారులు, కోటీశ్వరులుగా మారుతుంటారు. తొలకరి వర్షాల సమయంలో రాయలసీమ జిల్లాలలో కొందరు గొర్రెల కాపరులు, వ్యవసాయ కూలీలు, వ్యవసాయం చేసుకునే రైతులకు వజ్రాలు దొరికిన అనేక ఉదంతాలు ప్రతీ సంవత్సరం చోటు చేసుకుంటూనే ఉన్నాయి.

కర్నూలు జిల్లాలో తాజాగా కురిసిన భారీ వర్షంతో వజ్రాల వేట మొదలైంది. దీంతో అక్కడున్న రైతులందరూ అదృష్ట లక్ష్మి ని వెతుక్కుంటూ పొలాల వైపు పరుగులు పెడుతున్నారు. పొలాలలో వజ్రాల కోసం వేట మొదలు పెట్టారు. దాదాపు వజ్రకరూరు చుట్టుపక్కల ప్రాంతాలలో వజ్రాల వేట ఎక్కువగా కనిపిస్తుంది.
కర్నూలు, అనంతపురం జిల్లాలలో ఈ సీజన్ లో రాత్రికి రాత్రి కోటీశ్వరులుగా మారిన వారి అనేక ఉదంతాలు వెలుగుచూశాయి. ఇక వజ్రాల వ్యాపారులు కూడా ఈ సీజన్లో ఈ జిల్లాల బాట పడతారు. గుట్టుచప్పుడు కాకుండా స్థానికులకు దొరికిన వజ్రాలను కొనుగోలు చేస్తారు.
తాజాగా కర్నూలు జిల్లాలోని మద్దెకర మండలంలో వజ్రాల కోసం పొలాలలో రైతులు అన్వేషణ మొదలుపెట్టారు. ఈ క్రమంలో మండలంలోని బసినేపల్లి లో ఓ రైతుకు అత్యంత విలువైన వజ్రం దొరికింది. దానిని అమ్మకానికి పెట్టగా కొనడానికి వ్యాపారులు పోటీపడ్డారు అంటే దాని విలువ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.

చివరకు గుత్తికి చెందిన వజ్రాల వ్యాపారి ఆ రైతుకు దొరికిన అత్యంత విలువైన వజ్రాన్ని రెండు కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారని సమాచారం. ఇక ఈ విషయం తెలిసిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా తమకు కూడా ఓ వజ్రపు రాయి దొరికితే తమ దశ కూడా తిరుగుతుందని భావించి పొలాలలో వజ్రాల కోసం వేట మొదలుపెట్టారని తెలుస్తుంది.












Click it and Unblock the Notifications