11 నిమిషాల్లో ఫుల్ బాటిల్: ప్రాణం తీసిన పందెం(ఫొటో)
కరీంనగర్: జిల్లాలోని సిరిసిల్లలో సరదాగా వేసుకున్న పందెం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. సిరిసిల్ల మండలంలోని తంగళ్లపల్లి గ్రామానికి చెందిన పరిక రవి(40), నర్సయ్య, ఆకునూరి దేవయ్య అనే ముగ్గురు స్నేహితులు మద్యం తాగడంలో పందెం వేసుకున్నారు.
ఓ హోటల్‌లో మద్యం సేవించేందుకు కూర్చున్న వారు ఫుల్ బాటిల్ ఎవరు తక్కువ సమయంలో పూర్తి చేస్తారో వారు విజేత అని, ఓడిపోయిన వారు బిల్లు కట్టాలంటూ పందెం వేసుకున్నారు. ఆ పందెంలో భాగంగా రవి 11 నిమిషాల్లో బాటిల్ మద్యం సేవించగా, నర్సయ్య 6 నిమిషాల్లో పూర్తి మద్యం తాగాడు.

దేవయ్య 13 నిమిషాల్లో సేవించాడు. మద్యం తాగిన ముగ్గురు తాగిన 5 నిమిషాల్లోనే వాంతులు చేసుకున్నారు. కాగా, ఇద్దరు కోమాలోకి పోగా.. రవి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాసీరకం మద్యం సేవించడం వల్లే వారు మృతి చెందారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ఇది ఇలా ఉండగా జిల్లాలోని సైదాపూర్ మండలం ఎక్లాస్‌పూర్ గ్రామానికి చెందిన గోపగోని శంకరయ్య(50) వడదెబ్బతో మృతి చెందాడు. గత వారం రోజులుగా ఎండలు మండిపోతుండటంతో శంకరయ్య వడదెబ్బకు గురయ్యాడు. రెండు రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురైన శంకరయ్య గురువారం మధ్యాహ్నం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.












Click it and Unblock the Notifications