ఘోరం: భార్యను చంపి బాత్రూంలో పాతిపెట్టాడు, మిస్సింగ్ అంటూ నమ్మించాడు, చివరికి..
విజయనగరం: జిల్లాలోని వెంకంపేట ఏజెన్సీలో అదృశ్యమైన వివాహత కేసు విషాదాంతమైంది. ఆమెను భర్తే చంపి బాత్రూంలో పాతిపెట్టాడు. గత అక్టోబర్‌లో జరిగిన ఘటనపై దర్యాప్తు జరిపిన పోలీసులు.. నిందితుడు భర్తే అని తేల్చేశారు.
వివరాల్లోకి వెళితే.. 2017, అక్టోబర్ మాసంలో రమణమ్మను అత్యంత దారుణంగా హత్య చేసిన ఆమె భర్త నర్సయ్య.. ఆమె మృతదేహాన్ని అప్పుడే నిర్మిస్తున్న బాత్రూం అడుగుభాగంలో పాతిపెట్టాడు. ఆ తర్వాత రమణమ్మ కనిపించడం లేదంటూ ఇతర కుటుంబసభ్యులను నమ్మించాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భార్య కోసం తాను కూడా వెదుకుతున్నట్లు నర్సయ్య అందర్నీ నమ్మించాడు. అయితే, రమణమ్మను హత్య చేసిన నాటి నుంచి నర్సయ్య.. హైదరాబాద్, విశాఖపట్నంలకు తిరుగుతున్నాడు. వెంకంపేట ప్రాంతానికి మాత్రం రావడం లేదు. దీంతో అతనిపై రమణమ్మ కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది.
జూన్ 17న విశాఖలో నర్సయ్యను గమనించిన రమణమ్మ బంధువులు అతడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం చెప్పాడు. తన భార్యను తానే హత్య చేసినట్లు నర్సయ్య అంగీకరించాడు. కుటుంబ కలహాలతో రమణమ్మను హత్య చేసి బాత్రూం కింద పాతిపెట్టానని తెలిపాడు. దీంతో బాత్రూం వద్ద తవ్వి రమణమ్మ మృతదేహాన్ని బయటికి తీయించారుపోలీసులు.












Click it and Unblock the Notifications