శ్రీరాముడి గుడి రథానికి నిప్పు పెట్టిన కేసులో ట్విస్ట్, వైసీపీ కార్యకర్త అరెస్టు
తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ నెయ్యి వివాదం నేపథ్యంలో దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ లో రాముల వారి ఆలయ రథానికి నిప్పుపెట్టడం కలకలం రేపింది. అనంతపురం జిల్లాలోని కణేకల్లు మండలంలోని హనకనహాళ్ గ్రామంలో రాములవారి ఆలయ రథానికి నిప్పంటించడం ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలు ఉలిక్కిపడ్డారు.
రథానికి నిప్పు పెట్టిన వారిని పట్టుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ కు ఆదేశాలు జారీ చేశారు. అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తదితరులు సంఘటనా స్థలానికి వెళ్లి రాముల వారి రథానికి నిప్పు పెట్టిన తీరును పరిశీలించారు. పోలీసు అధికారుల దర్యాప్తులో దిమ్మ తిరిగిపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. బుధవారం అనంతపురం సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ జగదీష్ వివరాలు వెల్లడించారు.

రాముల వారి ఆలయం రథానికి ఈనెల 23వ తేదీన అర్దరాత్రి నిప్పు పెట్టిన ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ జగదీష్ అన్నారు. ఈశ్వర్ రెడ్డి ప్రస్తుతం వైసీపీ కార్యకర్తగా పనిచేస్తున్నాడని జిల్లా ఎస్పీ జగదీష్ అన్నారు. అయితే ఈ కేసులో కులం, మతం, పార్టీలకు సంబంధించిన ఎలాంటి గొడవలు లేవని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ చెప్పారు. జిల్లా ఎస్పీ జగదీష్ కథనం మేరకు ఫ్యామిలీ గొడవలు కారణంగానే శ్రీ రాముల వారి రథానికి నిప్పు పెట్టారని తెలిసింది.
హనకనహాళ్ కు చెందిన ఎర్రిస్వామి రెడ్డి సోదరులు రూ 20 లక్షల రూపాయల ఖర్చు పెట్టి శ్రీ రాముల వారి ఆలయానికి 2022లో గతంలో రథం తయారు చేయించారని జిల్లా ఎస్పీ జగదీష్ చెప్పారు. రథం తయారు చేయడానికి ఎర్రిస్వామి రెడ్డి సోదరులు ఆ గ్రామంలో ఏలాంటి విరాళాలు సేకరించి లేదని, వారి సొంత డబ్బులతోనే రాముల వారి ఆలయానికి రథాన్ని చేయించారని జిల్లా ఎస్పీ జగదీష్ వివరించారు. ఇటీవల ఎర్రిస్వామి రెడ్డి సోదరుల మధ్య శ్రీ రాములవారి గుడి రథం విషయంలో మనస్పర్థలు వచ్చాయని అన్నారు.

కుటుంబ గొడవల కారణంగా ఎర్రిస్వామి రెడ్డి కుమారుడు ఈశ్వర్ రెడ్డి రగిలిపోయాడని, ఈనెల 23వ తేదీ అర్ధరాత్రి పెట్రోల్ తీసుకెళ్లి రథం మీద పోసి నిప్పంటించాడని జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు. షెడ్డులో మంటలు, పొగ వ్యాపించడంతో స్థానికులు గుర్తించి వెంటనే మంటలు ఆర్పేవేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే రథం కొంతవరకు కాలిపోయిందని పోలీసు అధికారులు తెలిపారు.
సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ జిల్లా ఎస్పీ జగదీష్ దర్యాప్తు జరిపారు. ఈ కేసులో ఈశ్వర్ రెడ్డిని అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ జగదీష్ అన్నారు. ఈశ్వర్ రెడ్డి వైసీపీ కార్యకర్త అయినా రాముల వారి రథానికి నిప్పంటించిన కేసులో పార్టీలకు గాని, కుల మతాలకు గాని ఎలాంటి సంబంధం లేదని, కుటుంబ గొడవల కారణంగా ఈ సంఘటన జరిగిందని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ మీడియా చెప్పారు. అయితే ఈ కేసులో ఈశ్వరరెడ్డితో పాటు ఇంకా ఎవరికైనా సంబంధం ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నామని జిల్లా ఎస్పీ జగదీష్ అన్నారు.












Click it and Unblock the Notifications