24న శ్రీవారి ఆలయంలో ప్రధాన ఘట్టం- చురుగ్గా ఏర్పాట్లు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం 93,303 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 41,688 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.49 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 15 నుంచి 18 గంటల సమయం పట్టింది.
ఆ ఒక్క రోజే 4.58 లక్షల లడ్డూలు విక్రయం అయ్యాయి. రికార్డు స్థాయిలో 2.80 లక్షల మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. రద్దీ పెరిగిన నేపథ్యంలో క్యూ కాంప్లెక్సులు, క్యూ లైన్లు, నారాయణగిరి షెడ్ల వద్ద టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు, మంచినీని అందిస్తున్నారు. అదనపు షెడ్లను అమర్చారు.

కాగా తిరుమల శ్రీవారి ఆలయంలో కొలువైన పంచబేరాలలో అత్యంత విశిష్టమైన, నిత్య అర్చనలందుకునే శ్రీ భోగ శ్రీనివాసమూర్తి ప్రతిష్ఠాపన దినోత్సవం జూన్ 24వ తేదీన ఆలయంలో అత్యంత వైభవంగా జరగనుంది. ఆలయ గర్భాలయంలో విశేష సహస్ర కలశాభిషేకాన్ని వైభవంగా నిర్వహించేందుకు సర్వసిద్ధం చేస్తోంది. ఈ విశేష ఉత్సవానికి తిరుమల క్షేత్రంలో అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.
చారిత్రక శాసనాల ఆధారాల ప్రకారం, పల్లవ రాణి సామవై (కాడవన్ పెరుందేవి) క్రీస్తు శకం 966వ సంపత్సరంలో భోగ శ్రీనివాసమూర్తి (కౌతుకమూర్తి) వెండి విగ్రహాన్ని తిరుమలకు కానుకగా సమర్పించారు. పల్లవ రాణి ద్వారా ఆలయంలో ఈ ప్రతిష్ఠాపన జరిగిన చారిత్రక పవిత్ర దినాన్ని పురస్కరించుకుని ఏటా ఈ విశిష్ట ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ ప్రత్యేక పర్వదినం సందర్భంగా ఉదయం శ్రీవారి ఆలయ గర్భాలయం నుంచి దేవేరులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటు, శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని, ఆలయ రక్షకుడైన శ్రీ విష్వక్సేనులవారిని అత్యంత భక్తిశ్రద్ధలతో గరుడాళ్వార్ సన్నిధికి ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రత్యేక వేదికపై ఆశీనులను చేస్తారు. ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో వైదిక క్రతువులతో ఈ మహా పూజ ప్రారంభమవుతుంది.
ఇందులో భాగంగా స్వామివారి శక్తుల అనుసంధాన ప్రక్రియను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. గరుడాళ్వార్ సన్నిధిలో భోగ శ్రీనివాసమూర్తిని ఉంచి, ఆయనకు అభిముఖంగా విశ్వక్సేనులను ఆసీనులను చేస్తారు. అనంతరం ఆలయంలోని ప్రధాన మూలమూర్తి బొటనవేలిని శ్రీ మనవాళపెరుమాళ్ (శ్రీ భోగ శ్రీనివాసమూర్తి)ని కలుపుతూ ఒక పవిత్రమైన పట్టు దారాన్ని అనుసంధానం చేస్తారు.
దీనివల్ల మూలవిరాట్ లోని అఖండ దైవశక్తి ఈ భోగ శ్రీనివాసమూర్తి కి ప్రసరిస్తుందని, ఆ జగద్రక్షకుని దివ్య తేజస్సుతోనే ఈ అభిషేకం జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మంగళవాయిద్యాల మధ్య సుగంధ ద్రవ్యాలు మిళితం చేసిన కలశ జలాలతో శ్రీ భోగ శ్రీనివాసమూర్తి కి శాస్త్రోక్తంగా సహస్ర కలశాభిషేకాన్ని వైభవంగా జరుపుతారు. ఈ విశేషమైన అభిషేక మహాక్రతువు స్వామివారికి పరమ ప్రీతికరమైనదని, దీనివల్ల సర్వ జగత్తుకు శ్రేయస్సు, శాంతి చేకూరుతుందని పెద్దలు చెప్తారు.












Click it and Unblock the Notifications