ఆచంట పాలిటిక్స్: విజయబావుటా ఎగురవేసేదెవరు!!
పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు టికెట్లను ప్రకటిస్తున్న నేపథ్యంలో అసంతృప్తుల ఆగ్రహావేశాలతో రాజకీయం హీటెక్కింది. ఎలాగైనా మళ్ళీ అధికారంలోకి రావాలని వైసిపి ప్రయత్నం చేస్తుంటే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని గద్దె దించాలని తెలుగుదేశం జనసేన కూటమి శతవిధాల ప్రయత్నం చేస్తుంది.
మార్చి నెలలో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్న క్రమంలో దూకుడు పెంచిన అన్ని రాజకీయ పార్టీలు తమదైన శైలిలో రాజకీయాలను రసవత్తరంగా మారుస్తున్నాయి. ఇదిలా ఉంటే పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట రాజకీయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.. ఆచంట నియోజకవర్గంలో బిసి ఓటర్ల దే హవా.. అక్కడ బీసీలు ఎవరిని ఆదరిస్తే వారే విజయం సాధిస్తారు.

2019 అసెంబ్లీ ఎన్నికలలో చెరుకువాడ శ్రీరంగనాథరాజు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి విజయం సాధించి ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికలలో కూడా చెరుకువాడ శ్రీరంగనాథరాజు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల బరిలోకి దిగనున్నారు. అయితే వైసీపీలో కొందరి నుండి ఆయనపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు సమాచారం.
అయినప్పటికీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ తమ ప్రభుత్వంలో తీసుకువచ్చిన సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయని శ్రీరంగనాథరాజు ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నారు. ఇక మరోవైపు తాజాగా టిడిపి జనసేన పొత్తులలో భాగంగా ఆచంట నియోజకవర్గం నుండి తెలుగుదేశం జనసేనల ఉమ్మడి అభ్యర్థి పితాని సత్యనారాయణకు మళ్ళీ అవకాశం కల్పించారు.
స్థానికంగా మాజీ మంత్రి పితాని సత్యనారాయణకు మంచి పేరు ఉండడంతోపాటు, స్థానిక ఎమ్మెల్యే శ్రీరంగనాథ రాజుపై ఉన్న వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని టిడిపి భావిస్తోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన పితాని సత్యనారాయణకు ప్రజల నుండి మద్దతు లభిస్తుందని భావిస్తున్నారు.
గతంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలలో మంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటు బలమైన నేతగా గుర్తింపు ఉన్న పితాని సత్యనారాయణకు టికెట్ ప్రకటించడంతో దూకుడుగా ఆయన ప్రజాక్షేత్రంలోకి వెళ్ళబోతున్నారు. అయితే ఇక్కడ జనసేన నుండి టికెట్ ఆశించి భంగపడిన చేగొండి సూర్యప్రకాశ్, పితాని సత్యన్నారాయణకు సహకరిస్తారా లేదా అన్నది భవిష్యత్ లో తేలనుంది.












Click it and Unblock the Notifications