కొడాలి నానిపై నందమూరి హీరో- నారా లోకేష్‌తో చర్చలు..!!
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్- పాదయాత్రకు సన్నద్ధమౌతోన్నారు. యువగళం పేరుతో కాలినడకన రాష్ట్రాన్ని చుట్టేయనున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం వరకు సుమారు 4,000 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. 400 రోజుల పాటు ఆయన జనం మధ్యే ఉండబోతోనన్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాల మీదుగా సాగేలా టీడీపీ అగ్ర నాయకత్వం రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసింది.

ఏడాదికి పైగా..
ఈ నెల 27వ తేదీన కుప్పంలో తొలి అడుగు వేయనున్నారు నారా లోకేష్. ఇదివరకు ప్రతిపక్ష నేత హోదాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా ప్రస్థానాన్ని మించిన స్థాయిలో ఇది ఉంటుందని టీడీపీ చెబుతోంది. 2024 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా నారా లోకేష్ తన యువ గళాన్ని వినిపిస్తారని స్పష్టం చేస్తోంది. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్య వైద్యం వంటి అంశాలపై గ్రామస్థాయిలో ఉన్నాయని భావిస్తోన్న సమస్యలు, ఇతర అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తారు.

వైసీపీ ఇప్పటినుంచే..
నారా లోకేష్ తలపెట్టిన ఈ పాదయాత్రపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటి నుంచే ఎదురుదాడి మొదలు పెట్టారు. విమర్శలు గుప్పిస్తోన్నారు. యువగళంలో ప్రస్తావించడానికి నారా లోకేష్‌కు ఎలాంటి అంశాలు లేవని గుర్తు చేస్తోన్నారు. తమ ప్రభుత్వంలో అన్ని సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు సంతోషంగా ఉన్నారని, తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు, వలంటీర్లు, గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థలను రద్దు చేస్తానని నారా లోకేష్ చెప్పగలరా? అంటూ సవాల్ విసురుతోన్నారు.

నందమూరి తారక్ భేటీ..
ఈ పరిస్థితుల మధ్య ప్రముఖ నటుడు నందమూరి తారకరత్న- నారా లోకేష్ ను కలుసుకున్నారు. నారా లోకేష్ నివాసంలో ఈ భేటీ ఏర్పాటైంది. ఈ సందర్భంగా పలు అంశాలు వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదివరకు తారకరత్నతెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనే యోచనలో ఉన్నారాయన. 2024 నాటి సార్వత్రిక ఎన్నికల బరిలో దిగాలనీ భావిస్తోన్నారు.

పాదయాత్రకు సంఘీభావం..
నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్రకు తారకరత్న సంఘీభావం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నందమూరి కుటుంబ అభిమానులందరినీ ఏకం చేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన యువ నేతలందరూ ఒక్కో జిల్లా వారీగా ఈ పాదయాత్రలో పాల్గొనేలా షెడ్యూల్‌ను రూపొందించుకుంటామని హామీ ఇచ్చారు.

గుడివాడ టికెట్..
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తారకరత్న.. కృష్ణా జిల్లా గుడివాడ నుంచి పోటీ చేయొచ్చంటూ వార్తలొచ్చాయి. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నాని ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న స్థానం ఇది. 2004 నుంచీ ఆయనే ఇక్కడ జెండాఎగురవేస్తోన్నారు. 2004, 2009లో టీడీపీ తరఫున, 2014, 2019లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తిరుగులేని విజయాన్ని అందుకున్నారు. ఇక్కడ కొడాలి నానిని ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో టీడీపీ ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి.

టికెట్ ఖాయమా?
ఎన్నికల్లో పోటీ చేయాలనే తన ఉద్దేశాన్ని తారకరత్న ఈ భేటీ సందర్భంగా నారా లోకేష్ కు వివరించారని అంటున్నారు. ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలనే విషయం మీద చర్చించారని తెలుస్తోంది. గుడివాడ నుంచి బరిలోకి దిగాలనే అభిప్రాయాన్ని తారక్ వ్యక్తం చేయగా.. దీనికి సూచనప్రాయంగా లోకేష్ అంగీకరించారని సమాచారం. టికెట్లను ఖాయం చేయడానికి ఇంకా సమయం ఉన్నందున ఇప్పుడే ఈ విషయంపై చర్చించడం సరికాదని భావించినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications