టీడీపీలోకి సినీ నటుడు సప్తగిరి
తాను త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు సినీ నటుడు సప్తగిరి ప్రకటించారు. తిరుపతిలో జరిగిన ఒక ప్రయివేటు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనది చిత్తూరు జిల్లా అని, పేదలకు సేవ చేసేందుకు ఏ చిన్న అవకాశం వచ్చినా తనవంతు కృష్టి ఉంటుందన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఆఫర్ ఉన్నమాట వాస్తవమని, అయితే ముందే చెప్పడం బాగోదన్నారు. మరో రెండువారాల్లో శుభవార్త చెబుతానన్నారు.
చంద్రబాబునాయుడు చేసిన అభివృద్ధిని తాను చూశానని, ఎన్నికల్లో పోటీచేసే నిర్ణయాన్ని పెద్దలు తీసుకుంటారన్నారు. పాదయాత్రలో ఉన్న నారా లోకేష్ ను కలిశానని, తాను నిజాయితీగా సినిమా రంగంలో అవకాశాలు సంపాదించుకున్నానని, అలాగే రాజకీయాల్లోకూడా పేరుతెచ్చుకుంటానన్నారు. తాను సినిమాల్లో నటించడంవల్లే రాజకీయంగా అవకాశాలు వచ్చాయని, సినిమాలను వదిలేది లేదన్నారు.

చిత్తూరు జిల్లా ఐరాలలో తాను జన్మించానని, పుంగనూరు, బంగారుపాళ్యంలో చదివినట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ నుంచి అవకాశం లభిస్తే చిత్తూరు జిల్లాలో లోక్ సభకుకానీ, అసెంబ్లీకి కానీ తాను పోటీకి సిద్ధంగా ఉన్నానన్నారు. చంద్రబాబు, లోకేష్ ఏం చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తానన్నారు.
చిత్తూరు జిల్లా నుంచి సినిమాల్లోకి, అటునుంచి రాజకీయాల్లోకి ప్రవేశించి రాణించినవారున్నారు. ప్రస్తుతం పర్యాటకశాఖ మంత్రిగా ఉన్న రోజా ముందుగా టీడీపీలో చేరారు. తర్వాత వైసీపీ కండువా కప్పుకున్నారు. నగరి నుంచి వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. అలాగే చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ కూడా సినిమాల్లో నటించారు. చంద్రబాబుతో ఉన్న స్నేహం కారణంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి చిత్తూరు నుంచి ఎంపీగా విజయం సాధించారు. వీరిలానే నటుడు సప్తగిరి కూడా త్వరలోనే తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు.












Click it and Unblock the Notifications