బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం:కోస్తా,రాయలసీమలకు అలెర్ట్
విశాఖపట్నం: బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ అయ్యాయి. బంగ్లాదేశ్ ను ఆనుకొనివున్న ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అంతకంతకూ బలపడి తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతున్నది.
ఈ అల్పపీడనం సోమవారం నాటికి వాయుగుండంగా మారనున్నదని వాతావరణ శాఖ హెచ్చరించింది. తూర్పు భారతదేశం నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా వరకు ద్రోణి ఆవరించి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో ఇప్పటికే కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. అయితే రానున్న 24 గంటల్లో కూడా కోస్తాలో అనేకచోట్ల, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

అయితే ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచానా వేసింది. మరోవైపు రాష్ట్రంలో పలు చోట్ల ఎండ తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతుండటం గమనార్హం. తీవ్ర అల్పపీడనంతో కోస్తాలో తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమప్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. సముద్రంలో చేపలవేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.












Click it and Unblock the Notifications