వైసీపీ-టీడీపీ సత్తాకు సిసలు పరీక్ష- రేపే సెమీస్..!!
రాష్ట్రంలో శాసన మండలి ఎన్నికల పోలింగ్ సోమవారం జరుగనుంది. దీనికి- రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
అమరావతి: రాష్ట్రంలో పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గాల కోసం సోమవారం పోలింగ్ జరుగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ షెడ్యూల్ అయింది. మార్చి 16న ఓట్ల లెక్కింపు చేపడతారు. పట్టభద్రులు-3, ఉపాధ్యాయులు- 2, స్థానిక సంస్థల కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఎన్నుకోనున్నారు ఓటర్లు. ఇప్పటికే అయిదు స్థానిక సంస్థల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

మొత్తం ఓటర్లు..
పట్టభద్ర నియోజకవర్గాల్లో మొత్తం 10 లక్షల 519 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓటర్లు 55,842 మంది ఉన్నారు. స్థానిక సంస్థల కోటాలో 3,059 మంది ఓటు వేయనున్నారు. మొత్తంగా 10,56,720 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటారు.

1,538 పోలింగ్ కేంద్రాలు..
వారి కోసం 1,538 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రంలోనూ వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు అధికారులు. ఆయా నియోజకవర్గాల్లో 500 ప్రాంతాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. వాటిపై ప్రత్యేక నిఘా ఉంచారు. పోలింగ్ కేంద్రాల వద్ద ముమ్మర బందోబస్తును ఏర్పాటు చేశారు.

ప్రలోభాలపై..
ఓటర్లను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించిన వారిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో- ఇప్పటి వరకూ 77,48,010 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అలాగే పెద్ద ఎత్తున మద్యం సీసాలను సీజ్ చేశారు. 64 ఎక్సైజ్ కేసులు నమోదయ్యాయి. 75 మంది అరెస్ట్ అయ్యారు. 7,380 లైసెన్స్డ్ ఆయుధాలు పోలీసుల వద్ద డిపాజిట్ అయ్యాయి.

బైండోవర్ కేసులు..
అలాగే- పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా 7,266 మంది బైండోవర్ కేసులు నమోదు చేశారు. తెలుగుదేశం పార్టీ కొత్తగా బోగస్ ఓట్ల అంశాన్ని తెరమీదికి తీసుకొచ్చిన నేపథ్యంలో దీనిపై అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తున్నామని ఎన్నికల అధికారులు తెలిపారు. ఫేక్ సర్టిఫికెట్ తో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

బోగస్ ఓట్లపై..
టీడీపీ, సీపీఎం పార్టీల నాయకులు బోగస్ ఓట్లపై ఎన్నికల అధికారులకు ఇదివరకే ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ ఫిర్యాదులన్నీ తిరుపతి అర్బన్ నుంచి అందినవే. మిగిలిన నియోజవర్గాల నుంచి ఎలాంటి బోగస్ ఓట్ల ఫిర్యాదులు ఎన్నికల అధికారులకు అందలేదు. 663 పేర్లు బోగస్ ఓట్లను గుర్తిస్తూ చంద్రబాబు ఇదివరకే ఎన్నికల అధికారులకు జాబితాను పంపించారు.

పోలింగ్ స్టాఫ్ కు జాబితా..
ఇందులో 500 పేర్ల మీద ఇప్పటికే విచారణ చేసి, ఈసీకి నివేదికను పంపించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఒకే అడ్రస్ మీద ఎక్కువ ఓట్లు ఉన్నాయని వచ్చిన ఫిర్యాదు పరిశీలిస్తే వారంతా అదే ప్రాంతానికి చెందిన వారేనని గుర్తించినట్లు పేర్కొన్నారు. అడ్రస్ లో లేని, చనిపోయిన వారికి సంబంధించి జాబితాను ఇప్పటికే పోలింగ్ స్టాఫ్ కి పంపామని వివరించారు.












Click it and Unblock the Notifications