సెక్షన్ 8 చిక్కు, అందరి వేళ్లు కేసీఆర్ వైపు! 'విభజన కూడా చెల్లదు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 8 చెల్లదంటే అసలు రాష్ట్ర విభజననే చెల్లదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పీ నారాయణ ఆదివారం అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూలై నెలలో జపాన్ పర్యటనకు వెళ్తారని చెప్పారు.
రాజధాని నిర్మాణానికి జపాన్ సహకారాన్ని ఆయన కోరుతారని చెప్పారు. ఏపీ రాజధాని కోసం సింగపూర్ ఇప్పటికే సహకరిస్తానని ప్రకటించిందని చెప్పారు. సెక్షన్ 8 చెల్లదని టీఆర్ఎస్ విడ్డూరంగా మాట్లాడుతోందన్నారు. సెక్షన్ 8 చెల్లకుంటే విభజన ఎలా చెల్లుతుందని ప్రశ్నించారు. సెక్షన్ 8పై రాద్ధాంతం వద్దన్నారు.
విభజన చట్టం చేసినప్పుడు కేసీఆర్ మౌనంగా ఉన్నారని ఆరోపించారు. విభజన చట్టంలోని అన్ని అంశాలు అమలుపరచాల్సిందేనని చెప్పారు. కాగా, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్, ఏపీ మంత్రులు పలువురు విభజన చట్టం రాసింది కేసీఆరేనని, అప్పుడేం చేశారని ప్రశ్నించిన విషయం తెలిసిందే.

చంద్రబాబు నాయుడు అభినవ అంబేడ్కర్ అని మంత్రి పీతల సుజాత కొనియాడారు. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి ఆయన కృషి చేస్తున్నారన్నారు. ఉమ్మడి రాజధాని హైదరాబాదులో సెక్షన్ 8 అమలు చేయాల్సిందేనని చెప్పారు. రెండు రాష్ట్రాలను గవర్నర్ సమానంగా చూడాలన్నారు. సీమాంధ్రుల భయం పోగొట్టాలన్నారు.
ఉత్తరాఖండ్ యాత్రికులు క్షేమం
కడప జిల్లా నుండి ఉత్తరాఖండ్ వెళ్లిన 28 మంది యాత్రికులు క్షేమంగా ఉన్నారని మంత్రి గంటా శ్రీనివాస రావు ఆదివారం చెప్పారు. ఉత్తరాఖండులో చిక్కుకుపోయిన యాత్రికుల విషయమై ఆయన ఢిల్లీలోని ఏపీ భవన్ అసిస్టెంట్ రెసిడెంట్ కమిషనర్‌తో మాట్లాడారు. రేపు రాత్రికల్లా యాత్రికులు ఢిల్లీకి చేరుకుంటారని చెప్పారు.












Click it and Unblock the Notifications