తేలు కుట్టిన దొంగల్లా.. విశాఖ స్టీల్ ప్లాంట్ పై అన్ని పార్టీలు నో కామెంట్!!
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కు తగ్గుతున్నామని కేంద్రమంత్రి చేసిన ప్రకటనతో కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ పై వెనుక తగ్గడానికి తామే కారణం అంటూ, తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశాయి బీఆర్ఎస్, జనసేన, వైసిపి, టీడీపీ వంటి రాజకీయ పార్టీలు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అయితే కెసిఆర్ దెబ్బకు కేంద్రం దిగి వచ్చిందని, కెసిఆర్ తో పెట్టుకుంటే అట్లా ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఏకంగా మంత్రి కేటీఆర్, మంత్రి హరీష్ రావులు ఏపీలో అడుగుపెట్టక ముందే బిఆర్ఎస్ సాధించిన మొదటి విజయంగా దీనిని అభివర్ణించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని తను ఢిల్లీ వెళ్లి మరీ కేంద్ర పెద్దలకు విజ్ఞప్తి చేశానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై వెనక్కు తగ్గిన క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు.

ఇక ఈ క్రెడిట్ తమకు ఎక్కడ దక్కకుండా పోతుందోనని వైసీపీమంత్రులు సైతం తమదైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీని కలిసిన సందర్భంగా చేసిన విజ్ఞప్తి మేరకు స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందని పెద్దఎత్తున ప్రచారం చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఈ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకోవాలని తమ నేత పల్లా శ్రీనివాసరావు ఆమరణదీక్ష చేశారని గుర్తు చేశారు.
బిజెపి తమకు ఎక్కడ ప్రాధాన్యత తగ్గుతుందో అని విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులతో జీవీఎల్ సమావేశం నిర్వహించి హడావిడి చేశారు. కట్ చేస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ పై వెనక్కి తగ్గేది లేదని, ప్రైవేటీకరణ చేసి తీరుతామని మరోమారు కేంద్రం స్పష్టం చేసింది. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం వీరోచితంగా పోరాటం చేసింది మేమేనని చెప్పుకున్న నేతలకు ఒక్కసారిగా షాక్ తగిలినట్టు అయింది.

ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై వెనక్కి తగ్గేది లేదని కేంద్రం స్పష్టంగా చెప్పినా ఆ తర్వాత ఆయా పార్టీల నేతలు ఆ వ్యవహారం తమకు తెలీదు అన్నట్టుగా సైలెంట్ అయ్యారు. తెలు కుట్టిన దొంగల్లా మిన్నకున్నారు. నో కామెంట్ అంటూ నోటికి ప్లాస్టర్లు వేసుకున్నారు. అనవసరంగా స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో తొందరపడి రాష్ట్ర ప్రజల ముందు నవ్వుల పాలయ్యారు.
ఇప్పుడు కేంద్రం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించడం పక్కా అంటూ తేల్చి చెప్పినా.. ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ వ్యవహారంపై నోరు మెదపలేదు. కేంద్రం తాజా నిర్ణయం పై ఏం చెబుతారు అని ఆశగా ఎదురుచూసిన ప్రజలు రాజకీయపార్టీల నేతలు దీనిపై అసలు స్పందించకపోవడంపై అవాక్కయ్యారు. ఏదైనా రాష్ట్రానికి లబ్ధి జరిగితే మావల్లే జరిగిందని, నష్టం జరిగితే మాకేమీ తెలియదు అన్నట్టు ప్రవర్తించే రాజకీయనాయకుల తీరుతో ఏపీప్రజలు విస్తుబోతున్నారు.












Click it and Unblock the Notifications