ఏపీ అసెంబ్లీతోపాటు 96 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు: సర్వం సిద్ధం
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఇందుకోసం ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. నాలుగో విడతలో 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 96 లోక్‌సభ స్థానాల్లో సోమవారం (మే 13న) ఓటింగ్ జరగనుంది. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25, తెలంగాణలో 17, ఉత్తర్‌ప్రదేశ్‌లో 13, మహారాష్ట్రలో 11, మధ్యప్రదేశ్, బంగాల్‌లో 8 చొప్పున, బిహార్‌లో 5, ఒడిశా, జార్ఖండ్‌లో 4 చొప్పున, జమ్మూకాశ్మీర్‌లో ఒక లోక్‌సభ నియోజకవర్గంలో పోలింగ్ జరగనుంది. ఒడిశాలో 147 అసెంబ్లీ నియోజకవర్గాలకు నాలుగువిడతల్లో ఓటింగ్ జరగనుంది. మే 13న జరిగే తొలివిడతలో ఒడిశాలో 28 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.

ఏపీలో అసెంబ్లీతోపాటు లోక్‌సభ ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్‌ను నిర్దేశించే ఎన్నికల పోలింగ్‌కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 4 కోట్ల 14 లక్షల మంది ఓటర్లు.. లోక్‌సభ, అసెంబ్లీ బరిలో ఉన్న అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఈవీఎం లు, ఇతర సామగ్రితో సిబ్బంది, ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. రీపోలింగ్ లేకుండా హింసరహిత పోలింగే లక్ష్యమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. గత ఎన్నికల కన్నా 10 వేల మంది కేంద్ర బలగాల్ని అదనంగా మోహరించింది.
ఏపీలో 25 లోక్‌సభ స్థానాలకు 454 మంది, 175 శాసనసభ నియోజకవర్గాలకు 2,387 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 4 కోట్ల 14 లక్షల 18 వందల 87 మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఇందులో 2 కోట్ల 3 లక్షల 39 వేల 851 మంది పురుష ఓటర్లు, 2 కోట్ల 10 లక్షల 58 వేల 615 మంది మహిళా ఓటర్లు, 3,421 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు. 46, 389 పోలింగ్ కేంద్రాల్ని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. లక్షా 60 వేల ఈవీఎంలు వినియోగిస్తోంది.

సోమవారం ఉదయం 7 గంటలకు మొదలయ్యే ఓటింగ్ 169 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకు, అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకూ జరగనుంది. ఓటేసేందుకు వచ్చే దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు.
ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 34,165 పోలింగ్ కేంద్రాల్లో, వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేశారు. మాచర్ల, గురజాల, వినుకొండ, పెదకూరపాడు, తిరుపతి, చంద్రగిరి, విజయవాడ సెంట్రల్, పుంగనూరు, పలమనేరు, పీలేరు, రాయచోటి, తంబళ్లపల్లె లాంటి 14 సమస్యాత్మక నియోజకవర్గాల్లో వందశాతం మేర వెబ్ క్యాస్టింగ్ చేస్తున్నారు. పెద్ద మొత్తంలో పోలీసులను మోహరించారు. పోలింగ్ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications