త్వరలోనే "బిగ్ బాస్" అరెస్ట్.. లిక్కర్ స్కామ్‌లో బిగుస్తున్న ఉచ్చు !
ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కాం వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ కేసు విషయం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. దేశవ్యాప్తంగా చర్చకు తెరతీసింది. ఇప్పటికే ఈ కేసులో పలువురు కీలక వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
ఈ క్రమంలోనే కేంద్ర మంత్రులు, రాష్ట్ర హోం శాఖ మంత్రి సహా.. పలువురు నేతలు కీలక వ్యాఖ్యలు చేయడం సంచలణంగా మారుతోంది. త్వరలోనే బిగ్ బాస్ అరెస్ట్ అవుతారంటూ వ్యాఖ్యానించడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో వైసీపీ నేతలు ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎవరేం అన్నారంటే..?
లిక్కర్ స్కాం కేసుపై స్పందించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో లిక్కర్ స్కాం జరిగిన విషయం అందరికీ తెలిసిందేనని తెలిపారు. ఏం ఆధారాలు లేకుండా ఎవ్వరినీ అరెస్ట్ చేయరని.. బిగ్‌బాస్ అయినా సరే, ఆధారాలు దొరికితే తప్పించుకోలేరని అన్నారు. సిట్ ఇప్పటికే అన్ని ఆధారాలు సేకరిస్తోందని వెల్లడించారు. అంతే కాకుండా కూటమి ప్రభుత్వంపై వస్తున్న విమర్శలకు సైతం తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
జగన్ ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నాడని మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ భయంతోనే జగన్ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని ఆరోపించారు. ఎవరైనా తప్పు చేస్తే.. వారు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా చట్టం వదిలిపెట్టదని గుర్తు చేశారు.
ఇక ఇప్పటికే హోం మంత్రి వంగలపూడి అనిత కూడా ఈ అంశంపై స్పందించారు. జగన్ అరెస్ట్ గురించి మాట్లాడుతూ.. చట్టం తన పని తాను చేసుకుంటుందన్నారు. లిక్కర్ స్కాం కేసులో విచారణ వేగంగా జరుగుతోందని తెలిపారు. సిట్ షెల్ కంపెనీల గుట్టు రట్టు చేస్తోందని వివరించారు.

కీలకదశకు దర్యాప్తు..
లిక్కర్ స్కాం విచారణ ప్రస్తుతం కీలక దశలో ఉంది. కోట్లాది రూపాయల అక్రమ లావాదేవీలు, షెల్ కంపెనీలు, పన్నుల ఎగవేత ఆరోపణలతో ఇప్పటికే ముడుపుల వెనుక నిజాలు బయటపడుతున్నాయి. ఈ సమయంలో జగన్ అరెస్ట్ అంశం చర్చకు రావడంతో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇదే సమయంలో కీలక నేతల వ్యాఖ్యలు ఈ కేసును మరింత సెన్సేషనల్‌గా మార్చుతున్నాయి.












Click it and Unblock the Notifications