గం.12.45ని.లు: రాజధాని శంకుస్థాపన ముహూర్తం ఖరారు
విజయవాడ: నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు అయింది. ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం గం.12.45నిమిషాలకు రాజధానికి శంకుస్థాపన ముహూర్తంగా నిర్ణయించారు.
రాజధానికి భూమి పూజ చేసిన ప్రాంతంలోనే శంకుస్థాపన చేయనున్నారు. మందడం - ఉద్దండరాయపాలెం మధ్యలో ఈ వేడుక జరగనుంది. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర దేశాల ప్రధానులు, కేంద్రమంత్రులు, పలువురు ప్రముఖులు రానున్నారు. రాజధాని ప్రాంత రైతులు, ప్రజలు హాజరవుతారు.
గురువారం నాడు జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో శంకుస్థాపనం పైన నిర్ణయం తీసుకున్నారు. రాజధాని నగర శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని, ప్రధాని సహా పలువురు ప్రముఖులను ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.

కాగా, అంతకుముందు మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ... దసరా నవరాత్రుల తరహాలో రాజధాని శంకుస్థాపన వేడుకలు నిర్వహిస్తామన్నారు. లక్షమంది విచ్చేసే ఈ కార్యక్రమాన్ని భారీ వేడుకగా ఈ నెల 13 నుంచి 22 వరకు ఘనంగా నిర్వహిస్తామన్నారు.
మరోవైపు, 'రైతుకోసం చంద్రన్న యాత్ర' విజయవంతమైందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి పెద్దగా ఫిర్యాదులు కూడా రాలేదని, రుణమాఫీలో ఎలాంటి సమస్యలున్నా ఇప్పటికీ పరిష్కరిస్తామన్నారు. పెండింగ్ దరఖాస్తులను తమ దృష్టికి తీసుకురావాలని బ్యాంకులకు సూచిస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications