ఒకే వేదికపై చంద్రబాబు ..బీజేపీ..జనసేన : ప్రధాని మోదీ ఉద్దేశం అదే..!!
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు ఏకం అవుతున్నాయి. పొత్తుల పైన చర్చలు జరుగుతున్న వేళ.. ఆసక్తి కర పరిణామం చోటు చేసుకుంది. 2014 తరహాలో టీడీపీ - జనసేన- బీజేపీ పొత్తుతో ఎన్నికలకు వెళ్లాలని ప్రధాన ప్రతిపక్షంతో పాటుగా జనసేనాని కోరుకుంటున్నారు. కానీ, బీజేపీ తిరిగి టీడీపీతో జత కలుస్తుందా లేదా అనే దాని పైన ఇంకా స్పష్టత రాలేదు. కానీ, అమరావతి రాజధానిగా ఉండాలనే విషయంలో మాత్రం వైసీపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకమయ్యాయి.

అమరావతి పై ప్రధాని చెప్పారు
ఇప్పుడు ఆ పార్టీల కలయికకు అమరావతి అంశమే కీలకంగా మారుతోంది. అమరావతి ఉద్యమం పైన రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు జరిగిన కార్యక్రమంలో వైసీపీ మినహా అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. చంద్రబాబుతో పాటుగా బీజేపీ నుంచి కన్నా లక్ష్మీ నారాయణ.. జనసేన ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస యాదవ్ తో సహా కాంగ్రెస్ ..వామపక్షాల నేతలు పాల్గొన్నారు. ఈ సమయంలోనే చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. అమరావతి శంకుస్థాపన సమయంలో ప్రధాని మోదీ చెప్పిన అంశాలను గుర్తు చేసారు. పవిత్రమైన యమునా జలాల్ని, చట్టాలు చేసే పార్లమెంటు ఆవరణ నుంచి మట్టి తెచ్చానని చెప్పారు. పార్లమెంటు ఎప్పుడూ అమరావతికి అండగా ఉంటుందని చెప్పడమే దాని ఉద్దేశమన్నారు. దీని ద్వారా ప్రధానిని పరోక్షంగా అమరావతికి కట్టుబడి ఉండాల్సిన అవసరం గుర్తు చేస్తున్నారు.

సీఎం జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా
అమరావతి ఏ ఒక్క కులానికో పరిమితం కాదన్నారు. అమరావతిని అంత అభివృద్ధి చేశాక కూడా గత ఎన్నికల్లో ఎస్సీ స్థానమైన తాడికొండలో తెదేపా ఓడిపోయిందని చెబుతూ... హైదరాబాద్‌ని అభివృద్ధి చేశాక... 2004 ఎన్నికల్లో ఖైరతాబాద్‌లో ఓడిపోయమని గుర్తు చేసారు. కాబట్టి అభివృద్ధికి, ఎన్నికలకు సంబంధం లేదని చంద్రబాబు పేర్కొన్నారు. అదే సమయంలో వేదిక పైనే ఉన్న మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ను హైదరాబాద్‌లో తాను ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాల్ని నిలిపివేయాలన్న చర్చ వైఎస్ ఎప్పుడైనా చేశారా అని ప్రశ్నంచగా.. ఆయన లేదని చెప్పారని చంద్రబాబు వివరించారు. వైఎస్‌గానీ, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు గానీ తాను ప్రారంభించిన కార్యక్రమాల్ని నిలిపివేస్తే, హైదరాబాద్ ఇంతగా అభివృద్ధి చెందేది కాదన్నారు. ఇంతవరకు వెయ్యిరోజులు ఉద్యమం జరిగిన దాఖలాలు ఎక్కడా లేవని, అమరావతి రైతులు ఉక్కు సంకల్పంతో పోరాడుతున్నారని చంద్రబాబు కొనియాడారు.

భవిష్యత్ లోనూ మైత్రి కొనసాగేనా
అమరావతిపై కులముద్ర వేయడంతో అంతా నిజమే అనుకున్నారని జనసేన ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస యాదవ్ చెప్పారు. అమరావతి ఉద్యమంలో పోరాడేవారంతా ఆ కులానికి సంబంధించినవారు కాదన్నారు. రాజధాని అమరావతి అంటే రూ.లక్ష కోట్లు కాదు, జనజీవన స్రవంతి, నాగరికత.. అదో ప్రపంచమని ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. రాజధాని అమరావతిపై కక్షగట్టి, విషప్రచారం చేసిన వారికి సరైన బుద్ది చెప్పాలని కన్నా పిలుపునిచ్చారు. ఇప్పుడు.. అమరావతి రైతుల పాదయాత్రకు డీజీపీ అనుమతి నిరాకరించారు. ఈ నెల 12వ తేదీతో అమరావతి రైతుల ఉద్యమం వేయి రోజులకు చేరుతుంది. ఆ రోజునే పార్టీ అధినేతలను ఆహ్వానించి బహిరంగ సభ ఏర్పాటు చేయాలని భావించారు. ఇప్పుడు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో అన్ని పార్టీల నేతలు ఒకే స్వరం వినిపించారు. అటు ప్రభుత్వం ఈ మూడు రాజధానుల వ్యవహారంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుందనేది రోజు రోజుకీ ఉత్కంఠ పెంచుతోంది.












Click it and Unblock the Notifications