అనస్తీషియా వికటించి ఏడాదిన్నర బాలుడు మృతి.. వైద్యులు ఏం చేశారంటే..?
కేరళలోని కన్నూర్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. అనస్థీషియా వికటించడంతో ఏడాదిన్నర బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. పయ్యనూర్ లోని బేబీ మెమోరియల్ ఆస్పిటల్ లో ఈ ఘటన జరిగింది. బాలుడి పెదవికి గాయం కావడంతో ఆ చికిత్స నిమిత్తం అనస్థీషియా ఇవ్వగా స్పృహ కోల్పోయిన చిన్నారి కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయింది. అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ చనిపోయిందని చిన్నారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేస్తున్నారు. పెళ్లయిన 8 ఏళ్లకు పుట్టిన తమ ఒక్కగానొక్క బాబును ఆస్పత్రి వైద్యులు చంపేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కన్నూర్ లోని ఎరమామ్- కుత్తూర్ కు చెందిన దంపతులు సూరజ్- విధిష లకు దేవాన్ష్ శౌర్య బాబు ఉన్నాడు. చిన్నారి వయసు ఏడాదిన్నర. అయితే జూలై 5 న ఇంటి వద్ద ఆడుకుంటూ ఉండగా దేవాన్ష్ ఒక్కసారిగా కిందపడ్డాడు. దాంతో అతని పెదాలకు తీవ్ర గాయం అయింది. తొలుత బాలుడ్ని మతమంగళంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ కు తరలించారు. అక్కడే ప్రథమ చికిత్స చేశారు. ఆ తర్వాత బాలుడ్ని పయ్యనూర్ లోని బేబీ మెమోరియల్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు బాలుడికి అనస్థీషియా ఇచ్చి కుట్లు వేస్తుండగా బాలుడు స్పృహ కోల్పోయాడు.
అయితే వెంటనే కన్నూర్ లోని బేబీ మెమోరియల్ ఆస్పత్రికి బాలుడ్ని తరలించగా అక్కడే చికిత్స పొందుతూ రాత్రి 9 గంటల సమయంలో మృతి చెందాడు. దాంతో బాలుడి తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ చిన్నారి మృతి చెందిందని ఆరోపించాయి. అయితే ఆస్పత్రి వర్గాలు మాత్రం ఈ ఆరోపణలను ఖండించాయి.

చిన్నారికి అనస్థీషియా ఇస్తున్న క్రమంలో అనుకోకుండా హార్ట్ ఎటాక్ వచ్చిందని దాంతో చిన్నారిని వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించామని తెలిపాయి. బాలుడి ప్రాణాలు కాపాడేందుకు తాము శాయశక్తులా ప్రయత్నించామని పేర్కొన్నాయి. అనస్థీషియా ఇచ్చే క్రమంలో ఇలాంటి పరిణామాలు ఒక్కోసారి ఏర్పడతాయని చెబుతున్నాయి. ఈ మేరకు బేబీ మెమోరియల్ ఆస్పత్రి ప్రకటన విడుదల చేసింది. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications