వల్లభనేని వంశీ డిమాండ్ నెరవేర్చిన చంద్రబాబు..! ఫుల్ హ్యాపీ..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు కుటుంబంపై విమర్శలు చేసి టీడీపీ ఆగ్రహానికి గురై, కూటమి ప్రభుత్వం వచ్చాక కేసులు కూడా ఎదుర్కొన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) తాజాగా రూటు మార్చారు. నియోజకవర్గంలో రాజకీయంగా మారుతున్న పరిస్ధితుల ప్రభావమో, మరేదైనా కారణమూ తెలియదు కానీ వరుసగా ప్రజా సమస్యలపై సీఎం చంద్రబాబు(Chandrababu)కు నేరుగా లేఖలు రాయడం ప్రారంభించారు. ఇలా రాసిన ఓ లేఖలో డిమాండ్ ను చంద్రబాబు నెరవేర్చారు కూడా. దీంతో వంశీ ఆనందానికి అవధుల్లేకుండా పోతోంది.
గన్నవరం నియోజకవర్గంలోని మెట్ట ప్రాంత గ్రామాల వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ సరఫరాను పునరుద్దరించాలంటూ గతంలో వల్లభనేని వంశీ చంద్రబాబుకు లేఖ రాశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం.. తాజాగా విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల ఖరీఫ్ పంటలు దెబ్బతినకుండా కాపాడటంతో పాటు పోలవరం కుడి కాలువ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్‌పై ఆధారపడిన వేలాది మంది రైతులకు సాగునీరు అందేలా చేశారని ఆనందం వ్యక్తం చేస్తూ వంశీ ఇవాళ చంద్రబాబుకు మరో లేఖ రాశారు.

అయితే, ఈ సమస్యను తాత్కాలిక చర్యలతో కాకుండా శాశ్వత పరిష్కారంతో అధిగమించాలని వంశీ చంద్రబాబుకు సూచించారు. మెట్ట ప్రాంత భౌగోళిక పరిస్థితుల కారణంగా గ్రావిటీ ద్వారా సాగునీరు అందించడం సాధ్యం కాదని, పోలవరం కుడి కాలువ నుంచి వ్యవసాయ పంపుసెట్ల ద్వారా నియంత్రిత లిఫ్ట్ ఇరిగేషన్ మాత్రమే రైతులకు ఆచరణ సాధ్యమైన మార్గమని తెలిపారు. ఈ సమస్య పదేపదే తలెత్తుతున్నందున శాస్త్రీయ, శాశ్వత విధానాన్ని ప్రభుత్వం రూపొందించాలని కోరారు. ఈ నేపథ్యంలో నీటిపారుదల, వ్యవసాయ, రెవెన్యూ, ఇంధన శాఖలు సమన్వయంతో సమగ్ర సాంకేతిక అధ్యయనం చేపట్టి పోలవరం కుడికాలువ నుంచి మెట్ట ప్రాంత ఆయకట్టుకు నియంత్రిత నీటి ఎత్తిపోతలపై శాశ్వత విధానాన్ని రూపొందించాలని వంశీ కోరారు.

ఈ విధానంలో అర్హత కలిగిన మెట్ట ప్రాంత ఆయకట్టును గుర్తించడం, వ్యవసాయ పంపుసెట్ల ద్వారా నీటి ఎత్తిపోతలకు పారదర్శక నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేయడం, అందుబాటులో ఉన్న నీటి వనరులను శాస్త్రీయంగా కేటాయించడం, దిగువ ఆయకట్టు రైతుల ప్రయోజనాలను పరిరక్షించడం, అలాగే మెట్ట ప్రాంత గ్రామాల సాగునీటి అవసరాలను వార్షిక నీటి ప్రణాళికలో భాగం చేయాలని ఆయన సూచించారు. ఇలాంటి శాశ్వత విధానం అమల్లోకి వస్తే రైతులకు భరోసా కలగడంతో పాటు పారదర్శక నీటి పాలన, వివాదాల నివారణ, పోలవరం రైట్ మెయిన్ కెనాల్ సాగునీటి ప్రయోజనాల సమాన పంపిణీ సాధ్యమవుతుందని వంశీ తన లేఖలో పేర్కొన్నారు.














Click it and Unblock the Notifications