నవంబర్ 1 నుంచి సగం ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం..! పార్కింగ్ ఫీజుల డబుల్..!
దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) నానాటికీ వాయుకాలుష్యం పెరిగిపోతోంది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పరిస్దితిలో పూర్తిగా మార్పు రావడం లేదు. ముఖ్యంగా శీతాకాలం వస్తుందంటే చాలు ఢిల్లీ ప్రభుత్వం వణుకుతోంది. ఈ నేపథ్యంలో ఈసారి శీతాకాలంలోనూ భారీగా వాయు కాలుష్యం తప్పదని అంచనా వేసిన ప్రభుత్వం.. ఇవాళ కీలక చర్యలు ప్రకటించింది. ఇందులో భాగంగా వాహనాల పార్కింగ్ రుసుములను భారీగా పెంచడంతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల వేళల్లో మార్పులు, సగం మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) వంటి నిబంధనలను నవంబర్ 1 నుండి అమలు చేయనున్నారు.
ముఖ్యంగా ప్రైవేట్ వాహనాల వినియోగాన్ని తగ్గించి, ప్రజా రవాణాను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నవంబర్ 1 నుంచి 2027 ఫిబ్రవరి 28 వరకు నగరంలోని అన్ని పార్కింగ్ స్థలాల్లో సాధారణ ఫీజుల్ని రెట్టింపు చేస్తారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) పరిధిలోని పార్కింగ్ స్థలాలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించి, తద్వారా వచ్చే వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ఆఫీసుల వేళల్ని మార్చారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆఫీసులు ఉదయం 8:30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తాయి. అలాగే, ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6:30 గంటల వరకు కొనసాగుతాయి. రోడ్లపై వాహనాల ఏకకాల రద్దీని నివారించడానికే ఈ సమయ నియంత్రణను అమలు చేయబోతున్నారు.

నగరంలో దుమ్ము ద్వారా వ్యాపించే కాలుష్యాన్ని అరికట్టడానికి నిర్మాణ రంగంపై కూడా ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు విధించింది. వాహనాలు, పరిశ్రమలతో పాటు నిర్మాణ పనుల వల్ల వచ్చే దుమ్ము కాలుష్యానికి దీంతో చెక్ పెడతారు. నవంబర్ 1 నుంచి జనవరి 31 వరకూ బహిరంగ నిర్మాణ పనులు, కూల్చివేతలపై నిషేధం విధించారు. అలాగే డిసెంబర్ 10 నుండి జనవరి 20 వరకు అన్ని రకాల నిర్మాణ, కూల్చివేత పనులను పూర్తిగా నిలిపేస్తారు. ఢిల్లీ నగర శ్రేయస్సును కాపాడటానికి, శీతాకాలంలో చుట్టుముట్టే పొగమంచు, కాలుష్య ముప్పు నుండి ప్రజలను రక్షించడానికి ఈ ముందస్తు వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ప్రజలు కూడా ప్రైవేట్ వాహనాల వాడకాన్ని తగ్గించి, కాలుష్య నియంత్రణ చర్యలకు సహకరించాలని ప్రభుత్వం కోరుతోంది.













Click it and Unblock the Notifications
