బఘీరా.. ఆర్మీలో అదాని డిఫెన్స్ సంచలనం
రాజస్థాన్ పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సంస్థ తన స్వదేశీ బఘీరా ఏటీ1 (Bagheera AT1) యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది. శతృవుల ట్యాంకులను దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ధ్వంసం చేయగల సామర్థ్యం ఉన్న ఈ క్షిపణి వ్యవస్థను సైన్యం, రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారుల సమక్షంలో ప్రదర్శించారు. 4x4 ఆర్మర్డ్ వాహనంపై ఏర్పాటు చేసిన ఈ సిస్టమ్.. లక్ష్యాలను ఛేదించి తన రక్షణ సామర్థ్యాన్ని నిరూపించుకుంది. పగలు గానీ, రాత్రి వేళ గానీ విజయవంతంగా దీన్ని పరీక్షించవచ్చని తేలింది.
ఈ క్షిపణి వ్యవస్థలో అత్యంత కీలకమైన అంశం లేజర్ బీమ్ రైడింగ్ గైడెన్స్ టెక్నాలజీ. సమకాలీన పోరాటాల్లో విస్తరిస్తున్న ఎలక్ట్రానిక్ జామింగ్ దాడులను తట్టుకుని, నిర్దేశిత లక్ష్యాన్ని ఖచ్చితత్వంతో ఛేదించడానికి ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది. శతృవుల ట్యాంకులపై ఉండే 'యాక్టివ్ ప్రొటెక్షన్ సిస్టమ్'ను ధ్వంసం చేయడానికి ఒకేసారి వరుసగా రెండు క్షిపణులను ప్రయోగించే (టాండెమ్ ఫైరింగ్) సదుపాయం కూడా ఇందులో ఉంది. మొదటి క్షిపణి ట్యాంక్ రక్షణ కవచాన్ని నిష్ఫలం చేస్తే, రెండో క్షిపణి దాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తుంది.

అదానీ డిఫెన్స్ స్వయంగా రూపకల్పన చేసిన ఈ 4x4 ఆర్మర్డ్ వాహనంపై ఉండే ఆటోమేటెడ్ లాంచర్ లో ఒకేసారి నాలుగు క్షిపణులను సిద్ధంగా ఉంచవచ్చు. వీటితో పాటు వాహనంలో మరో ఎనిమిది రీలోడ్ మిస్సైల్స్ ఉంటాయి. అంటే.. ప్రతి వాహనం మొత్తం 12 క్షిపణుల సామర్థ్యంతో రక్షణ సేవలు అందిస్తుంది. శతృవుల దాడికి గురికాకుండా ఉండేందుకు షూట్ అండ్ మూవ్ పద్ధతిలో దాడి చేసి వెంటనే వేరే సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లే వెసులుబాటు ఉండటం దీని ప్రత్యేకత.
ప్రస్తుతం భారత సైన్యం మిలాన్-2టీ, కాంకర్స్-ఎమ్ వంటి పాత తరం క్షిపణులపై ఎక్కువగా ఆధారపడుతోంది. అత్యవసర అవసరాల కోసం స్పైక్, జావెలైన్ వంటి విదేశీ రక్షణ వ్యవస్థలను సేకరిస్తున్నప్పటికీ, సరిహద్దుల వద్ద సుదూర పరిధి కలిగిన స్వదేశీ క్షిపణి వ్యవస్థల అవసరం ఎంతగానో ఉంది. సాధారణ భూఆధారిత క్షిపణుల పరిధి నాలుగు కిలోమీటర్లు మాత్రమే కాగా, బఘీరా ఏటీ1.. ఏకంగా ఎనిమిది కిలోమీటర్ల పరిధిలోని ట్యాంకులు, గగనతల లక్ష్యాలను కూడా సమర్థవంతంగా ఎదుర్కొగలదు.
భారత సైనిక దళాల అవసరాలకు తగినట్లుగా 18 నెలల వ్యవధిలోనే అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఈ కాంబ్యాట్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది. దేశీయంగా రక్షణ ఉత్పత్తుల తయారీ గణనీయంగా పెరుగుతున్న తరుణంలో ఈ పరీక్షలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత రక్షణ ఉత్పాదన రూ. 1.78 లక్షల కోట్లకు చేరగా, అందులో ప్రైవేట్ రంగం వాటా 24 శాతానికి పెరిగింది. రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని వేగవంతం చేయడంలో ఇటువంటి ప్రైవేట్ రంగానికి చెందిన పరిశోధనలు ఎంతగానో ఉపయోగపడతాయి.
పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపొందిన బఘీరా ఏటీ1 క్షిపణి వ్యవస్థ సైన్యానికి అందుబాటులోకి వస్తే రక్షణ దళాల ఎదురుదాడి సామర్థ్యం మరింత పెరుగుతుంది. అత్యవసర రక్షణ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడమే కాకుండా, మన దేశ సరిహద్దుల్లో ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా సవాలును ఎదుర్కొనేందుకు ఇది దోహదపడుతుంది. సైనిక దళాల అవసరాలకు అనుగుణంగా ఆధునిక ఆయుధ సంపత్తిని స్వదేశంలోనే రూపొందించడంలో భారత్ సాధిస్తున్న పురోగతికి పోఖ్రాన్‌లో జరిగిన ఈ ప్రయోగాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
అదానీ గ్రూప్ సంస్థల్లో భాగమైన అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్.. పదాతి, వైమానిక, నౌకా రంగాలలో భారత రక్షణ శాఖకు స్వయంసమృద్ధి దిశగా నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ డిఫెన్స్ సంస్థగా ఎదిగిన ఈ సంస్థ.. త్రివిధ దళాలకు కావలసిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా వైమానిక, నౌకాదళం, భూతల దళాల రక్షణ అవసరాలకు తగిన సాధనాలను భారతదేశంలోనే స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన చేసి తయారు చేస్తోంది.
ఈ సంస్థ ప్రధానంగా మానవరహిత డ్రోన్ వ్యవస్థలు, వైమానిక నిఘా విమానాలు, ఆధునిక మందుగుండు సామగ్రి, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ పరికరాల ఉత్పత్తిపై దృష్టి సారించింది. అంతర్జాతీయ ప్రసిద్ధ సాంకేతిక భాగస్వాములతో పాటు దేశీయంగా ఉన్న ఎంఎస్ఎంఈ తరహా పరిశ్రమలను కూడా తమతో అనుసంధానిస్తోంది. దీనిద్వారా దేశంలో ఒక బలమైన రక్షణ పారిశ్రామిక వ్యవస్థను నిర్మిస్తూ, భారత మిలిటరీ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తోంది.












Click it and Unblock the Notifications
