టీటీడీ గోశాలను సందర్శించిన పార్లమెంటరీ కమిటీ
తిరుపతిలో టీటీడీకి చెందిన ఎస్వీ గోశాలను కేంద్ర పశుసంవర్ధక శాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ నేతృత్వంలోని పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ సందర్శించింది. ఎంపీ ఈటెల రాజేందర్.. ఈ కమిటీలో సభ్యుడు. పశుసంవర్ధక శాఖపై తిరుపతిలో నిర్వహించిన కన్సల్టేటివ్ కమిటీ సమావేశం ముగిసిన వెంటనే ఆయన నేతృత్వంలోని ఎంపీల బృందం ఈ గోశాల ప్రాంగణాన్ని పరిశీలించింది. గంటన్నరపాటు గోశాల నిర్వహణపై ఆరా తీసింది.
కేంద్ర ప్రభుత్వ రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకం నిధులతో ఇక్కడ ఏర్పాటు చేసిన పశువుల వసతి షెడ్లు, ఆరోగ్య పరిరక్షణ చర్యలు, నిర్వహణ విధానాలను క్షేత్రస్థాయిలో స్వయంగా సమీక్షించింది. ఈ గోశాలలో ప్రధానంగా స్వదేశీ రకానికి చెందిన విశిష్ట సాహివాల్ జాతి ఆవులను శాస్త్రీయ పద్ధతుల్లో పోషిస్తోన్నారు.

ఈ ఆవుల నుంచి లభించే పాలు, ఇతర ఇతర పాడి ఉత్పత్తులను తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ప్రధాన ఆలయంతో పాటు తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి నిత్య పూజలు, శ్రీవారి పవిత్ర అభిషేక అవసరాల కోసం వినియోగిస్తోన్నారు. కైంకర్యాలకు అవసరమైన నాణ్యమైన ఉత్పత్తులను అందించడంలో ఈ గోశాల కీలకమైన పాత్ర పోషిస్తోందని పార్లమెంటరీ కమిటీ సభ్యులు ప్రశంసించారు.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు సందర్శించిన వాటితో పోలిస్తే టీటీడీ గోశాల భిన్నంగా, ఆధునిక సదుపాయాలతో రూపుదిద్దుకుందని కేంద్ర మంత్రి బఘేల్ ప్రశంసించారు. విశాలమైన షెడ్లు, మూగజీవాలకు నాణ్యమైన దాణా సరఫరా, నిరంతర వైద్య పర్యవేక్షణ వంటి అంశాలు ఇక్కడ అద్భుతంగా అమలవుతున్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో ఈ గోశాల సమగ్ర నిర్వహణ, స్వదేశీ ఆవుల సంరక్షణ దేశానికే రోల్ మోడల్ గా ఎదుగుతుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.
స్వదేశీ పశు సంపదను కాపాడుకోవడంతో పాటు ప్రముఖ ధార్మిక క్షేత్రాల అవసరాలకు తగిన పాడి ఉత్పత్తులను స్వయంగా సమకూర్చుకోవడం ఎంతో అభినందనీయమని పార్లమెంటరీ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఎస్వీ గోశాల డైరెక్టర్ డాక్టర్ ఏవీఎన్ శివకుమార్, వివిధ విభాగాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పశువుల సంరక్షణ తీరుతెన్నులను మంత్రి బృందానికి సమగ్రంగా వివరించారు.














Click it and Unblock the Notifications
