ఠారెత్తించిన రిషభ్ పంత్: మాస్ సెంచరీ
న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌పై టీమిండియా పట్టు బిగించింది. పటిష్ట స్థితికి చేరుకుంది. భారత జట్టు 720 పరుగుల ఇన్నింగ్ డిక్లేర్ చేసింది. మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం సాధించింది. కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ సెంచరీలతో చెలరేగారు. మిగిలిన బ్యాటర్లు సైతం సత్తా చాటారు. నాలుగో రోజు ఆటలో భారత జట్టు న్యూజిలాండ్ పై ఏకంగా 341 పరుగుల భారీ ఆధిక్యాన్ని నమోదు చేసింది.
ఓపెనెర్లు, టాప్ ఆర్డర్ బ్యాటర్లు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. యశస్వి జైస్వాల్- 85, కేఎల్ రాహుల్- 136, దేవదత్ పడిక్కల్- 80, మిడిలార్డర్లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్- 98 లతో ఆకాశమే హద్దుగా ఆడారు. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ తన మార్క్ విధ్వంసక ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. 153 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 128 పరుగులు చేసి న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపాడు. లోయర్ ఆర్డర్లో ధ్రువ్ జురెల్ 78 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు స్కోరు 700 దాటడంలో కీలక పాత్ర పోషించాడు.

ఈ సెంచరీ రిషభ్ పంత్ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సేనా దేశాల్లో టెస్టు సెంచరీ సాధించిన మొదటి విదేశీ వికెట్‌కీపర్ బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. దీంతో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో 3,000 పరుగులు పూర్తి చేసిన మొదటి వికెట్‌కీపర్‌గా నిలిచి తన సత్తా చాటాడు. టెస్టుల్లో వికెట్ కీపర్‌గా పంత్‌కు ఇది తొమ్మిదవ సెంచరీ. ఈ జాబితాలో ఆడమ్ గిల్‌క్రిస్ట్- 17, అండీ ఫ్లవర్- 12 మాత్రమే అతని కంటే ముందు వరుసలో ఉన్నారు.
2018లో ఇంగ్లాండ్ పర్యటనలో తన తొలి టెస్టు సెంచరీ నమోదు చేసిన పంత్.. విదేశీ పిచ్ లపై నిలకడగా రాణిస్తూ పలు చారిత్రక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇంగ్లాండ్ ఓవల్ స్టేడియంలో 114 తన జైత్రయాత్ర ఆరంభించిన పంత్.. ఇప్పటికీ దాన్ని కొనసాగిస్తూనే వస్తోన్నాడు. 2019లో సిడ్నీ- 159 (నాటౌట్), 2022లో కేప్‌టౌన్- 100 (నాటౌట్), అదే ఏడాది బర్మింగ్ హామ్ లో 146, లీడ్స్ లో 134 పరుగులు చేశాడు. ఇప్పుడు వెల్లింగ్టన్ లో 128 పరుగులతో రికార్డు నెలకొల్పాడు.
ఈ ఇన్నింగ్స్‌లో 6 సిక్సర్లు బాదడం ద్వారా పంత్ టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఇప్పటివరకు 108 సిక్సర్లు సాధించిన పంత్, న్యూజిలాండ్ మాజీ దిగ్గజం బ్రెండన్ మెక్‌కలమ్ (107 సిక్సర్లు) రికార్డును అధిగమించాడు. ఈ జాబితాలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ 138 సిక్సర్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
అనంతరం రెండో ఇన్నింగ్ కు బ్యాటింగ్ దిగిన న్యూజిలాండ్ కు ఆరంభంలోనే షాక్ ఇచ్చాడు జస్ ప్రీత్ బుమ్రా. రెండో ఓవర్ లో ఆ జట్టు కేప్టెన్ ఓపెనర్ టామ్ లాథమ్ డకౌట్ అయ్యాడు. ప్రస్తుతం డెవాన్ కాన్వే- 0, మొదటి ఇన్నింగ్ సెంచరీ హీరో హెన్రీ నికోల్స్ 13 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.













Click it and Unblock the Notifications
