యలహంక నివాసంలోకి షర్మిల కు నో ఎంట్రీ - కోర్టు ఆదేశాలు, కీలక మలుపు..!!
యలహంకలో షర్మిల ప్రవేశం వివాదం కొత్త మలుపు తీసుకుంది. షర్మిల తన కుమార్తె వివాహం యలహంకలోని నివాసంలో చేయాలని తొలుత భావించారు. అందుకు జగన్ అభ్యంతరం వ్యక్తం చేయటంతో వివాహ వేదిక మార్పు చేసుకున్నారు. కాగా, ఇప్పుడు యలహంకలో నివాసంకు షర్మిల వెళ్లే ముందు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ వ్యవహారం కోర్టుకు చేరటంతో.. షర్మిల యలహంక నివాసంలోని అనుమతి నిరాకరిస్తూ కోర్టు ఇంటెరిమ్ ఇంజంక్షన్ ఉత్తర్వులను జారీ చేసింది. తదుపరి విచారణ వరకు ఈ ఉత్తర్వులు అమలు అవుతాయని స్పష్టం చేసారు.
బెంగళూరులోని యలహంక నివాసం విషయంలో కొంత కాలంగా జగన్- షర్మిల మధ్య ఓపెన్ వార్ కొనసాగుతోంది. యలహంక లోని తన నివాసంలో కుమార్తె అంజలి వివాహం చేయాలని షర్మిల భావించారు. ఇందుకు జగన్ నుంచి అభ్యంతరం వ్యక్తం అవుతూ లేఖ రాసారు. దీంతో.. షర్మిల తన కుమార్తె వివాహ వేదిక మార్పు చేసుకున్నారు. ఇక.. ఇప్పుడు షర్మిల తన కుటుంబ సభ్యులతో కలిసి యలహంక ఇంటికి వెళ్లే వేళ బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. షర్మిల యలహంక నివాసంలోకి రాకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ సిలికాన్ బిల్డర్స్ ప్రైవేటు లిమిటెడ్ తరఫున భీమిశెట్టి రమేశ్ బాబు ఈ కేసు దాఖలు చేశారు. ''షర్మిలతోపాటు ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరులు ఎవరూ యలహంకలోని నివాసంలోకి అడుగుపెట్టనివ్వొదు'' అని కోర్టు ను కోరారు. ఈ పిటీషన్ విచారణ చేసిన న్యాయస్థానం ఎక్స్-పార్టీ యాడ్-ఇంటెరిమ్ ఇంజంక్షన్ ఉత్తర్వులను జారీ చేసింది.

కోర్టు తాజా ఉత్తర్వులతో
తదుపరి విచారణ తేదీ వరకు ప్రతివాది అయిన వైఎస్ షర్మిల గానీ, ఆమె కుటుంబ సభ్యులు, ఏజెంట్లు లేదా ప్రతినిధులు గానీ వివాదాస్పద ఆస్తిలోకి ప్రవేశించి పిటిషనర్‌కు ఆటంకం కలిగించరాదని కోర్టు ఆదేశాల్లో స్పష్టం చేసింది. వివాదాస్పద ఆస్తిని 2007 మార్చి 1న శ్రీ ఇ.సి. సుగుణమ్మ వద్ద నుంచి 2027 ఫిబ్రవరి 28 వరకు లీజు అగ్రిమెంట్ ద్వారా తాము స్వాధీనం చేసుకున్నామని సిలికాన్ బిల్డర్స్ సంస్థ కోర్టుకు తెలిపింది. తాము అక్కడ భారీగా ఖర్చు చేసి గెస్ట్ హౌస్‌లు, ఇతర కట్టడాలతో పాటు వ్యవసాయ కార్యకలాపాలు, పండ్ల తోటలు నిర్వహిస్తున్నామని పేర్కొంది. ఆ తర్వాత 2026 ఆగస్టు 27న సదరు యజమాని తన కుమార్తె, మనవరాళ్ల పేరిట రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్స్ రాసిచ్చారని, ఆ లీజు వారి పేరిట బదిలీ అయిందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో.. ఇప్పుడు ఈ వ్యవహారంలో కొత్త కోణం బయటకు వచ్చింది. దీని పైన షర్మిల భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది స్పష్టత రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications
